ఇలాంటి సందర్భాలు చాల అరుదు..చిన్నారి డ్రా తీస్తే సొంతింటి కల నెరవేరింది!

Spread the love

రాజేంద్రనగర్‌లోని లక్ష్మీగూడలో జరిగిన లక్కీడ్రా ఒక పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేసింది. ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదృష్టం అంటే ఇదేనేమో అనేటటువంటి ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పరిధికి సంబంధించి లక్ష్మీగూడలో నిర్వహించిన లక్కీడ్రా టోకెన్ ను ఒక చిన్న పిల్లవాడితో తీపించినపుడు ఆ చిన్నోడి కుటుంబానికే ఇల్లు రావడం వార్తల్లో నిలిచింది. ఈ మేరకు ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి తన సోషల్ మీడియా ఎకౌంట్ లో పోస్ట్ చేశారు.  పేదల సొంతింటి కల తీర్చాలనే ఈ ప్రభుత్వ సంకల్పానికి, దేవుడి ఆశీస్సులు తోడైనట్టు చిన్నోడు తీసిన లక్కీ డ్రాలో వారి కుటుంబానికే (జరపుల లక్ష్మీ) గారికి టోకెన్ రావడం మా అందరిని ఆనందానికి మరియు ఆశ్చర్యానికి గురి చేసింది.ఇలాంటి సందర్భాలు చాల అరుదు. చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం..చిన్నారులు స్వచ్ఛమైన మనసుగల్గిన వారు. దేవుడి ఆశీర్వాదం, ప్రభుత్వ సహకారంతో వారి కల నేరవేరుతున్నందున ఆ కుటుంబం సొంతింటిలో జీవితాంతం చల్లగా బ్రతకాలని ఆ ఆడబిడ్డను మనసారా ఆశీర్వదించినట్లు తెలిపారు. 

ఒక చిన్నారి తీసిన లక్కీడ్రా వల్ల వారి కుటుంబానికే ఇల్లు లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లక్కీడ్రా పద్ధతిని అమలు చేయడం ద్వారా ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకతను పాటిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గతంలో ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు, రాజకీయ జోక్యం జరిగాయనే ఆరోపణలు ఉండేవి. ఇప్పుడు లక్కీడ్రా విధానంతో అలాంటి సందేహాలకు అవకాశం లేకుండా పోయింది. ఇది ప్రజల్లో ప్రభుత్వ పాలనపై విశ్వాసాన్ని పెంచుతోంది. ముఖ్యంగా అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్లు దక్కాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది ఒక చక్కటి నిదర్శనం.

పారదర్శకతను మరింత పెంచడానికి, ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు యాప్’ను కూడా ప్రవేశపెట్టింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది, అధికారులు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఫోటోలు తీసి, వివరాలను యాప్‌లో నమోదు చేస్తారు. సొంత స్థలం ఉన్నవారిని వారి స్థలం వద్ద ఉంచి జియో ట్యాగింగ్ ద్వారా ఫోటోలు తీస్తారు. కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో అక్రమాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు, తద్వారా నిజమైన అర్హులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, ఇలాంటి పారదర్శక కేటాయింపులు తెలంగాణలోని సామాన్య ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువస్తున్నాయి. సొంత ఇల్లు అనే కల మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఒక పెద్ద ఆకాంక్ష. తమకంటూ ఒక ఇళ్లు  ఉంటే ఆర్థిక భద్రతతో పాటు సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. లక్ష్మీగూడ ఘటన వంటివి పథకం పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని, ఆశను పెంచుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్లు కొనడం లేదా అద్దెకు తీసుకోవడం చాలా కష్టంగా మారింది, అందుకే ప్రభుత్వ పథకాలు చాలా అవసరం. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *