ప్రళయ భీభత్సం.. చుట్టూ ఇళ్లు కొట్టుకుపోతుంటే, అది ఒక్కటే ఎలా నిలిచింది?

Spread the love

నేపాల్‌ను ఇటీవల ముంచెత్తిన ఆకస్మిక వరదలు ప్రపంచాన్ని అటువైపు చూసేలా చేశాయి. ఈ ప్రక్రుతి విపత్తు అత్యంత తీవ్రమైన బీభత్సాన్ని సృష్టించింది. భారీ వర్షాలతో ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. రహదారులు నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉంది అంటే.. రోడ్లపై ఉన్న భారీ ట్రక్కులు, వాహనాలు సైతం ఆ ప్రవాహాన్ని తట్టుకోలేక కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో ఇళ్ల గోడలు కూలిపోయాయి. వరద నీటితో పాటు మట్టి, చెత్త, భారీ చెట్ల కొమ్మలు, నిర్మాణ శిథిలాలు ప్రవహించడంతో పరిస్థితి భయానకంగా  మారింది. ఈ ప్రకృతి విపత్తుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వరద తీవ్రత ఏస్థాయిలో ఉందో ప్రపంచానికి చూపిస్తున్నాయి. అయితే ఇంతటి భయంకరమైన విధ్వంసం మధ్య ఒక భవనం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఇళ్లు, నిర్మాణాలు ఒక్కొక్కటిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పటికీ, ఈ భవనం మాత్రం చెక్కుచెదరకుండా స్థిరంగా నిలబడింది. భవనం చుట్టూ వరద నీరు అత్యంత ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా, దాని ప్రధాన నిర్మాణం మాత్రం ఏమాత్రం దెబ్బతినలేదు. సాధారణంగా ఇలాంటి వరదల సమయంలో నీటి ప్రవాహం ఇళ్ల పునాదులను బలహీనపరిచి నిర్మాణాలను కూల్చివేస్తుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా, పక్కనే ఉన్న కట్టడాలు కూలిపోతున్నా ఈ ఒక్క భవనం నిలిచి ఉండటం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. 

 ఈ బిల్డింగ్ చుట్టూ అంతా వరద నీరు భయంకరంగా ప్రవహిస్తున్న సమయంలో ఆ భవనం లోపల ఒక కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది. బయట వరద ఉద్ధృతిని చూస్తూ ఆ కుటుంబ సభ్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు.తమ కళ్లముందే చుట్టుపక్కల ఇళ్లు నీటిలో కొట్టుకుపోతుండటంతో, తర్వాతి క్షణం తమ ఇల్లు పరిస్థితి ఏమవుతుందో అని వారు తీవ్ర ఆందోళన చెందారు. వరద ప్రవాహం మరింత పెరిగితే తమ భవనం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అని భావించారు. అయితే పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నప్పటికీ ఆ భవనం వరదను తట్టుకుని నిలబడటంతో, అందులో ఉన్నవారికి పెను ప్రమాదం తప్పింది. బయట విధ్వంసం కొనసాగుతున్న సమయంలో, లోపల ఆ కుటుంబం అనుభవించిన నరకయాతన  నిజంగా మాటల్లో చెప్పలేనిది. మరి చుట్టుపక్కల అంత భారీ ప్రవాహంలో  ఆ ఇల్లు మాత్రం ఎందుకు ఎఫెక్ట్ అవలేదు అని అలాగే ఇది ఆ భవనం నిర్మాణ నాణ్యతకు నిదర్శనం కొందరు ఇలా ఎవరికి తోచిన వాదన వారు సోషల్ మీడియాలో చేస్తున్నారు. అలాగే మరికొందరు భవనం ఉన్న ప్రదేశం, నేల స్వభావం, నీటి ప్రవాహం వచ్చిన తీరు వంటివి కీలక కారణాలు అని అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం ఒక వీడియో ఆధారంగా ఆ భవనం ఎందుకు కూలిపోలేదు అనే దానిని మనం చెప్పలేం. భవనం పునాది ఎంత లోతుగా ఉంది, నిర్మాణ సమయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించారు అన్న విషయాలు కూడా ముఖ్యం. కానీ ఈ ఘటన వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో పటిష్ఠమైన నిర్మాణాల అవసరాన్ని మనకు మరోసారి గట్టిగా గుర్తుచేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను మనం పూర్తిగా నివారించలేం. అయితే నిర్మాణాలు చేపట్టే ముందు భూమి స్వభావం, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకోవడం వంటివి సరైన ప్రణాళికతో చేపడితే నష్టాన్ని కచ్చితంగా తగ్గించవచ్చు అని ఇటువంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *