ప్రపంచంలోని అత్యంత విషాదకరమైన ఆనకట్ట ప్రమాదాల్లో చైనాలోని బాంకియావో డ్యామ్ విపత్తు ఒకటిగా నిలిచిపోయింది. 1975 ఆగస్టులో టైఫూన్ నినా ప్రభావంతో హెనాన్ ప్రావిన్స్‌లో ఊహించని స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల వ్యవధిలోనే భారీగా నీరు రిజర్వాయర్ల వైపు ప్రవహించింది. బాంకియావో డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యాన్ని మించే స్థాయిలో వరద ప్రవాహం చేరింది.భారీ వర్షాలు అలాగే అప్పటి ఫ్లడ్ కంట్రోల్ సిస్టమ్ ల పరిమితులు పరిస్థితిని మరింత క్లిష్టం చేశాయి. ఆ సమయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతినడం మరో దెబ్బ. దీంతో ప్రమాద హెచ్చరికలను వేగంగా చేరవేయడం కష్టమైంది. బాంకియావో విఫలమైన తర్వాత దిగువ ప్రాంతాల్లోని ఇతర ఆనకట్టలపై కూడా భారీ ఒత్తిడి పడింది. ఒకదాని తర్వాత మరొకటి ఆనకట్టలు దెబ్బతినడంతో ప్రవాహం గ్రామాలు, పట్టణాలను ముంచెత్తి భారీ ప్రాణనష్టం సంభవించింది.ఆ సమయంలో జరిగిన ఘటనపై అధికారికంగా నమోదైన మరణాల సంఖ్య, తరువాతి అధ్యయనాల్లో వచ్చిన అంచనాలు వేర్వేరుగా ఉండడం గమనార్హం. కొన్ని పరిశోధనలు వరద అనంతరం ఆకలి, వ్యాధుల కారణంగా అదనపు మరణాలు సంభవించాయని చెబుతున్నాయి. ఇక ఈ ఘటన విపత్తుకు ముందే హెచ్చరిక వ్యవస్థలు సిద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. బాంకియావో విషాదం ప్రకృతి శక్తి, ఇంజనీరింగ్ లిమిటేషన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ లోపాలు కలిస్తే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూపించింది.
బాంకియావో డ్యామ్ నిర్మాణం అప్పటి చైనా భారీ నీటి ప్రాజెక్టుల కార్యక్రమంలో భాగంగా జరిగింది. 1950ల ప్రారంభంలో బాంకియావో డ్యామ్ నిర్మాణం పూర్తయింది. తరువాత దాని నిర్మాణంలో మార్పులు, బలోపేత చర్యలు చేపట్టినట్లు చారిత్రక రికార్డులు చెబుతున్నాయి. అయితే 1975లో వచ్చిన వర్షపాతం సాధారణ వరద పరిస్థితులను మించి పోయింది. టైఫూన్ నినా ప్రభావం కారణంగా హెనాన్ లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్ లోకి వచ్చిన భారీ నీరు ఆ రిజర్వాయర్ విడుదల సామర్థ్యంపై తీవ్ర ఒత్తిడిని సృష్టించింది.ఈ సమయంలో గేట్ల నిర్వహణ, అత్యవసర సమాచార వ్యవస్థలపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. సమాచారం ఆలస్యంగా చేరడం వల్ల దిగువ ప్రాంతాల ప్రజలను సకాలంలో తరలించడం కష్టమైంది. ప్రవాహం వేగంగా విస్తరించడంతో ప్రజలకు స్పందించే సమయం కూడా మిగలలేదు. ఇక తరువాత అనేక ప్రాంతాల్లో రవాణా, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విపత్తు ప్రభావం వరద తగ్గిన తర్వాత కూడా కొనసాగింది. విపత్తు నిర్వహణలో వైఫల్యాన్ని ఈ విషాదం సూచిస్తోంది. ఇక ఈ డ్యామ్ నిర్మాణం గురించి మాట్లాడుకుంటే చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజులవి. మావో జెడాంగ్ హయాంలో ‘హార్నెస్ ది హువాయ్ రివర్’ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 1951-1952 మధ్య హెనాన్ ప్రావిన్స్ లోని రూ నదిపై ‘బాంకియావో’ డ్యామ్‌ను నిర్మించారు. కొన్నేళ్లకే అందులో పగుళ్లు రావడంతో 1955-56లో సోవియట్ యూనియన్ ఇంజనీర్ల సాయంతో దానిని పునర్నిర్మించారు. ప్రపంచంలోనే ఎవరూ బద్దలు కొట్టలేని ‘ఐరన్ డ్యామ్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1958లో మావో చేపట్టిన ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్’ ఉద్యమంలో భాగంగా జుమడియన్ ప్రాంతంలోనే 100కు పైగా రిజర్వాయర్లను కట్టారు. ఆ సమయంలో సీనియర్ హైడ్రాలజిస్ట్ చెన్ జింగ్ కేవలం నీటిని నిల్వ చేయడంపైనే దృష్టిపెట్టి, డ్రైనేజీని విస్మరిస్తే ప్రమాదకరమని హెచ్చరించినా, పాలకులు ఆయన్ను పట్టించుకోలేదు. ఇక 1975 జూలై చివరిలో పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ‘టైఫూన్ నినా’ తుఫాను కారణంగా లిన్ఝువాంగ్ ప్రాంతంలో ఆగస్టు 5 నుండి 7 వరకు అత్యధికంగా 1,605 మిల్లీమీటర్ల వర్షం పడింది. బాంకియావో వద్ద 1,422 మిమీ వర్షపాతం నమోదైంది. బాంకియావో రిజర్వాయర్‌లోకి సెకనుకు 13వేల క్యూబిక్ మీటర్ల నీరు పోటెత్తింది. అయితే దాని గేట్ల నుంచి మాత్రం కేవలం సెకనుకు 1,700 క్యూబిక్ మీటర్లు మాత్రమే విడుదల చేసే సామర్థ్యం ఉంది. అంటే విడుదల వేగం కంటే నీరు లోపలికి వచ్చే వేగం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది.
ఇక ఇటువంటి పరిస్థితుల్లో కూడా అధికార యంత్రాంగం నిర్లిప్తత ప్రదర్శించింది. నిబంధనల ప్రకారం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా, ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రాకపోవడంతో అక్కడి సిబ్బంది నిర్ణయం తీసుకోలేకపోయారు. కనీసం సెకనుకు 450 క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా, కేవలం 300 క్యూబిక్ మీటర్లకే పరిమితం చేశారు. అంతలోనే మిగతా కమ్మ్యూనికేషన్ వ్యవస్థలైన టెలిఫోన్, రేడియో వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. సైన్యం పంపిన అత్యవసర సిగ్నల్ ఫ్లేర్లను ఎవరూ గుర్తించలేదు. ఇన్ఫర్మేషన్ అందించడానికి వెళ్లిన కొరియర్లు ప్రవాహంలో గల్లంతయ్యారు. షాహెడియన్ నగరానికి మాత్రమే గంట ముందు హెచ్చరిక చేరింది. అప్పటికే అక్కడ 827 మంది చనిపోయారు. ఇక ఎలాంటి హెచ్చరిక అందని పలు గ్రామాల్లో వేలాది మంది ప్రవాహంలో కలిసిపోయారు. ఆగస్టు 7 అర్ధరాత్రి దాటిన కొద్ది నిమిషాలకే, బాంకియావో ప్రొటెక్షన్ వాల్ పై నుంచి నీరు ఉప్పొంగి మట్టి కట్టను కోసేసింది. కొద్దిసేపటికే 701 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు సెకనుకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో 10 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు గల భారీ ప్రవాహంగా దిగువకు దూసుకుపోయింది. బాంకియావోకు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమంతాన్ డ్యామ్ సహా మొత్తం 62 డ్యామ్‌లు ఒకదాని వెంట ఒకటి పేలిపోయాయి. కొన్ని రిజర్వాయర్లను కాపాడేందుకు మరికొన్ని డ్యామ్‌లను అధికారులే ఉద్దేశపూర్వకంగా పేల్చేశారు. ఆ ఒక్క రాత్రిలోనే 26,000 మంది నేరుగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
వరద మిగిల్చిన విధ్వంసం ఆ తర్వాత కొన్ని నెలలపాటు కొనసాగింది. బీజింగ్-గ్వాంగ్ఝౌ రైల్వే లైన్, రహదారులు తెగిపోవడంతో 10 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆగస్టు 13 నాటికి 20 లక్షల మంది నీటి మధ్య చిక్కుకుపోయి ప్రాణాల కోసం చెట్లపై వేలాడారు. ఆకలి తాళలేక నరకయాతన అనుభవించారు. ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలాయి. ప్రిన్స్టన్-సింగువా విశ్వవిద్యాలయాల 2017 అధ్యయనం ప్రకారం ఆకలి, వ్యాధుల వల్ల మరో లక్ష మంది చనిపోయారు. హ్యూమన్ రైట్స్ వాచ్ 1995 నివేదిక ప్రకారం, త్రీ గార్జెస్ ప్రాజెక్టును వ్యతిరేకించిన ఎనిమిది మంది సీనియర్ చైనా నిపుణులు మొత్తం మరణాల సంఖ్య 2లక్షల 30 వేలు అని తేల్చారు. అప్పట్లో చైనా ప్రభుత్వం ఈ మహా విషాదాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా పూర్తిగా తొక్కిపెట్టింది. ప్రభుత్వ పత్రికలు సహాయక చర్యల గురించిన ప్రచార వార్తలు మాత్రమే రాశాయి కానీ డ్యామ్ వైఫల్యాన్ని, మరణాలను దాచిపెట్టాయి. 1995లో హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ ఇచ్చే వరకు ఈ నిజాన్ని ప్రపంచం గుర్తించలేకపోయింది. అధికారిక పత్రాలు దాదాపు 30 ఏళ్ల పాటు అత్యంత రహస్యంగానే ఉండిపోయాయి. 1986 నుండి 1993 మధ్య బాంకియావో డ్యామ్ ను మళ్లీ నిర్మించినప్పటికీ, చేసిన తప్పులను దాచిపెట్టే చైనా వైఖరి మాత్రం మారలేదు.బాంకియావో విషాదం.. ప్రకృతి విపత్తులు ఎంతటి పెను ప్రమాదంగా మారగలవో ప్రపంచానికి చాటిచెప్పే ఒక పెను విషాదం. ప్రమాదాన్ని ముందుగానే ప్రజలకు చేరవేయడమే కీలకం. ఆ విషాద ఘటన గతమే కావొచ్చు. ఇక ముందు ఎదుర్కొనే విపత్తుల నుండి కాపాడుకునేందుకు వ్యవస్థలను ఎంత శక్తివంతంగా తయారు చేసుకోవాలో తెలిపే ఒక గట్టి పాఠంగా మిగిలిపోయింది.