రియల్ హీరో అభినందన్…న్యూ ఇన్నింగ్స్

Spread the love

భారత వైమానిక దళంలో అభినందన్ వర్ధమాన్ గురించి తెలియని వారుండరు. శత్రు దేశం జెట్ ను కూల్చి అక్కడ తాను చూపిన ధైర్యసాహసాలను దేశం ఎప్పటికీ గుర్తుచుకుంటుంది. 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత జరిగిన ఆ పరిణామాలు ప్రతి భారతీయుడికి మన సైనికుల సత్తాను గుర్తుకుతెస్తూనే ఉంటాయి. 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. దానికి బదులు తీర్చుకునేందుకు పాక్ వాయుసేన మరుసటి రోజు భారత గగనతలం వైపు దూసుకొచ్చింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న అభినందన్.. తన మిగ్-21 బైసన్  యుద్ధ విమానంతో పాక్ విమానాలను తరిమికొట్టారు. ఈ గగనతల పోరాటంలో  , పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-16  ఫైటర్ జెట్‌ను అభినందన్ కూల్చేశారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తూ ఆయన విమానం కూడా కూలిపోవడంతో పాకిస్థాన్ భూభాగంలో పడిపోయారు. శత్రు సైన్యానికి చిక్కినప్పటికీ, ఏమాత్రం బెదరకుండా ఆయన చూపిన తెగువ  ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచాయి. దాదాపు మూడు రోజుల పాటు పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న ఆయనను, భారత్ ,   అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడితో పాక్ వణికిపోయి వాఘా బోర్డర్ ద్వారా సురక్షితంగా మన దేశానికి అప్పగించింది.ఇక తన కెరీర్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయన, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రశాంతంగా ప్రారంభించారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వీర చక్ర పురస్కార గ్రహీత, గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ మిలిటరీ కెరీర్‌కు ఇటీవల వీడ్కోలు పలికారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన గోవా కేంద్రంగా పనిచేస్తున్న ప్రాంతీయ ప్రైవేట్ విమానయాన సంస్థ  FLY91 లో కమర్షియల్ పైలట్‌గా చేరారు. ఈ ఏడాది ఆగస్టులోనే ఆయన విధుల్లోకి చేరినట్లు తెలుస్తోంది. అయితే, సంస్థలో ఆయనకు అప్పగించిన నిర్దిష్ట బాధ్యతలు, ఏ రూట్లలో ఆయన విమానాలు నడుపుతారు అనే విషయాలను ఎయిర్‌లైన్ గోప్యంగా ఉంచింది. ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయలేమని, ఇది సంస్థ పాలసీ అని FLY91 ప్రతినిధులు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో వైమానిక పోరాట సమయంలో విధి పట్ల అసాధారణ అంకితభావం, తెగువను ప్రదర్శించినందుకు గాను 2021లో కేంద్ర ప్రభుత్వం అభినందన్‌ను మూడో అత్యున్నత యుద్ధ శౌర్య పురస్కారమైన  వీర చక్ర  అందుకున్నారు. అభినందన్ తండ్రి, ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్ కూడా భారత వైమానిక దళంలో అత్యున్నత స్థాయిలో సేవలందించారు. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిన రియల్ హీరో అభినందన్ వర్ధమాన్ .. ఇప్పుడు పౌర విమానయానంలో కమర్షియల్ పైలట్‌గా మారాడంటే ఆ విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు కూడా ఒక గర్వకారణమే అని చెప్పాలి. గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ తన ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలని యావత్ దేశం కోరుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *