గ్రహాంతర నివాసం: అనంత విశ్వంలో ఇంకో భూమి ఉందా?

Spread the love

ఈ విశ్వం అనంతం అది నిత్యం విస్తరిస్తూనే ఉంటుంది. ఇక ఈ విశ్వంలో  భూమి లాంటి గ్రహం మరెక్కడైనా ఉందా? మరే గ్రహంపైనైనా  జీవం ఉందా?  గ్రహాంతరవాసులు  ఇంకెక్కడైనా జీవిస్తున్నారా? ఎంతో కాలంగా అన్వేషణలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా మన సౌర కుటుంబానికి ఆవల, 337 కాంతి సంవత్సరాల దూరంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఒక వింతైన గ్రహాల వ్యవస్థను కనుగొన్నారు. ఇందులో ఒక గ్రహం చూస్తే నిప్పుల కొలిమిలా ఉంటే.. ఇంకో గ్రహం మాత్రం అచ్చం భూమిని తలపిస్తోంది. TOI-1752 c  గా పిలుస్తున్న ఆ కొత్త గ్రహం ఇప్పుడు ప్రపంచ సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా నాసా  వాడే కెస్లర్ లేదా టెస్  టెలిస్కోప్‌లకు ఎన్నో గ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే వాటన్నింటిలోకి ఈ TOI-1752 వ్యవస్థ అత్యంత ప్రత్యేకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి సుమారు 337 కాంతి సంవత్సరాల దూరంలో TOI-1752 అనే ఒక ఎర్రని చిన్న  నక్షత్రం ఉంది. ఇది మన సూర్యుడి కంటే కొంచెం చిన్నగా, తక్కువ వేడితో ఉంటుంది. అయితే ఈ నక్షత్రం చుట్టూ రెండు గ్రహాలు తిరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. నక్షత్రానికి అత్యంత చేరువలో ఉన్న గ్రహం లావా.  రెండో గ్రహం  భూమిని పోలిన నివాసయోగ్యమైన గ్రహం. ఒకే నక్షత్రం చుట్టూ ఇంత వైరుధ్యం ఉన్న రెండు గ్రహాలు ఉండటం చాలా అరుదు అని, ఈ ఆవిష్కరణ ఖగోళ శాస్త్రంలో ఒక మైలురాయి అని పరిశోధకులు తమ జర్నల్స్‌లో పబ్లిష్ చేశారు. ఇక ఈ రెండు గ్రహాల గురించి వింటుంటే చాలా అతిశయోక్తిగా ఉంటుంది. ఒక గ్రహం మండుతూ ఉంటే.. దాని పక్కనే ఉన్న మరో గ్రహం చల్లగా ప్రాణవాయువు కోసం ఎదురుచూస్తోంది.  ముందుగా  TOI-1752 b  విషయానికి వస్తే.. ఇది తన మాతృ నక్షత్రానికి చాలా దగ్గరగా తిరుగుతోంది. దీనివల్ల ఆ గ్రహం ఉపరితలంపై వందలాది డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ నేలంతా కరిగిపోయి, సముద్రాల స్థానంలో ఎర్రటి లావా  ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ప్రాణులు బతకడం అసాధ్యం.  ఇక మరో గ్రహమైన TOI-1752 c  సబ్-నెప్ట్యూన్ తరహా గ్రహం. అంటే భూమి కంటే సుమారు 2.29 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇది తన నక్షత్రం చుట్టూ హ్యాబిటబుల్ జోన్, గోల్డీలాక్స్ జోన్  లో తిరుగుతోంది. హ్యాబిటబుల్ జోన్ అంటే.. నక్షత్రానికి మరీ దగ్గరగా ఉండి కాలిపోకుండా, మరీ దూరంగా ఉండి గడ్డకట్టుకుపోకుండా.. నీరు ద్రవరూపంలో   ఉండటానికి అనువైన ఉష్ణోగ్రతలు ఉండే అనువైన ప్రదేశం. మన సౌర కుటుంబంలో భూమి సరిగ్గా ఇదే జోన్‌లో ఉంది కాబట్టే ఇక్కడ ప్రాణులు పుట్టాయి. హ్యాబిటబుల్ జోన్‌లో ఉందంటే అక్కడ కచ్చితంగా ద్రవరూపంలో నీరు ఉండే అవకాశం ఉంటుంది. నీరు ఉంటే జీవం ఉంటుంది. అందుకే గ్రహాంతరవాసుల అన్వేషణకు ఈ గ్రహం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.ప్రస్తుతం ఆస్ట్రానమర్స్  దృష్టి అంతా ఈ TOI-1752 c గ్రహం పైనే ఉంది. నిజంగా అక్కడ జీవించడానికి అనువైన వనరులు ఉన్నాయా? అక్కడ గ్రహాంతరవాసులు జీవిస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో పడ్డారు. దీనికోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్  ను రంగంలోకి దించనున్నారు. ఈ టెలిస్కోప్ ద్వారా ఆ గ్రహం వాతావరణంలోకి తొంగిచూసి, అక్కడి మూలకాలను విశ్లేషిస్తారు . ఒకవేళ ఆ గ్రహం వాతావరణంలో నీటి ఆవిరి గానీ, లేదా జీవరాశికి సంబంధించిన బయో-సిగ్నేచర్స్  గానీ దొరికితే అది మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆవిష్కరణగా పేర్కొనవచ్చు. ఈ అనంత విశాల విశ్వంలో మనం ఒంటరి వాళ్లం కాదు అనే వాదనకు మరింత బలం చేకూరుతుంది. భూమి లాంటి మరో గ్రహం దొరికిందన్న వార్త అద్భుతంగా ఉన్నప్పటికీ.. అక్కడికి మనిషి చేరుకోవడం ప్రస్తుత టెక్నాలజీతో అసాధ్యం. ఎందుకంటే 337 కాంతి సంవత్సరాల దూరం అంటే కాంతి వేగంతో  సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు  ప్రయాణించినా అక్కడికి వెళ్లడానికి 337 ఏళ్లు పడుతుంది. అయితే కనీసం అక్కడ జీవం ఉనికి  ఉందన్న విషయం తెలిసినా ఈ ప్రయాణంలో ఒక అది అతిపెద్ద మైలురాయిని చేరుకున్నట్లే. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *