కమల్ హాసన్ పవర్ ఫుల్ లుక్…ఎస్.యు. అరుణ్ కుమార్ తో కొత్త ప్రాజెక్టు

Spread the love

తెరపైన చేయని పాత్రే లేదు అనే స్థాయిలో నటనకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు కమల్ హాసన్.  ఇక వయసు అనేది కేవలం ఒక నెంబర్ అనే విధంగా ఈ ఏజ్ లో కూడా పవర్ ఫుల్ యాక్షన్ రోల్స్ తో అదరగొట్టారు. విక్రమ్ సినిమాలో ఆయన చేసిన నటనతో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఒక సెన్సేషనల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. కోలీవుడ్‌లో పన్నైయారుమ్ పద్మినియుమ్, విజయ్ సేతుపతితో చేసిన సేతుపతి, రీసెంట్‌గా సిద్ధార్థ్ హీరోగా వచ్చి కంటతడి పెట్టించిన  సిద్ధా .. ఈ సినిమాలన్నీ ఒకే దర్శకుడి నుంచి వచ్చాయి. ఆయనే ఎస్.యు. అరుణ్ కుమార్. సాధారణంగా అరుణ్ కుమార్ కథలు చాలా గ్రౌండెడ్‌గా, సహజంగా  ఉంటూనే.. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే బలమైన పాత్రల చుట్టూ అల్లుకుని ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ డ్రైవెన్ డైరెక్టర్‌కు, కమల్ హాసన్ లాంటి కంప్లీట్ యాక్టర్ తోడైతే వెండితెరపై ఆ మ్యాజిక్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఏలుతున్న దిగ్గజ నటుడు, తన ఇమేజ్‌ను పక్కనపెట్టి కథను నమ్మి ఓ సెన్సిబుల్ యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇవ్వడం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. 

హీరోగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్‌ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విక్రమ్ సక్సెస్ తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది.ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సరికొత్త చిత్రాన్ని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్  బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సంచలన ప్రాజెక్టును ఆర్.కె.ఎఫ్.ఐ తో పాటు ప్రముఖ నిర్మాత ఆర్. మహేంద్రన్, టర్మెరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  విక్రమ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజ్ కమల్ సంస్థ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. శివకార్తికేయన్ అమరన్ లాంటి సినిమాలను నిర్మించి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో నిరూపించిన కమల్.. ఇప్పుడు స్వయంగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సరికొత్త చిత్రంపై ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ , ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే ఒక సాలిడ్ ప్రోమో ద్వారా అధికారికంగా ప్రకటించనున్నారు. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు, సీక్వెల్స్ హవా నడుస్తున్న తరుణంలో.. బలమైన కథను, నవతరం దర్శకుల విజన్‌ను నమ్మి కమల్ హాసన్ చేస్తున్న ఈ ప్రయోగం నిజంగా అభినందనీయం. కమల్ యాక్టింగ్, అరుణ్ కుమార్ ఎమోషనల్ కనెక్ట్.. ఈ రెండూ కలిస్తే బాక్సాఫీస్ వద్ద మరో సూపర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *