చైనాకు సరైన కౌంటర్.. గ్లోబల్ వేదికపై డ్రాగన్ పరువు తీసిన ఫిలిప్పీన్స్

Spread the love

చైనా తన విస్తరణవాదంతో ఎప్పుడు ఇతర దేశాలతో పేచీలకు రెడీగా ఉంటుందనే విషయం తెలిసిందే. అదే కోవలో తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా దిగజారుతుందని మరోసారి నిరూపించుకుంది. ఏకంగా ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తున్న మరో దేశపు రక్షణ మంత్రికి, మధ్యలో ఒక చీటీ పంపించి ఆ సదస్సు నిర్వాహకులను, ఆ దేశాన్ని అవమానించే ప్రయత్నం చేసింది. కానీ, ఆ చీటీని అందుకున్న ఆ రక్షణ మంత్రి కూడా ఏమాత్రం భయపడకుండా, లైవ్‌లోనే ఆ చీటీని చదివి వినిపించి చైనా కండకావరాన్ని, అహంకారాన్ని ప్రపంచం ముందు పెట్టి తగిన బుద్ది చెప్పాడు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సవాళ్లపై చర్చించడానికి సౌత్  కొరియా సియోల్ డిఫెన్స్ డైలాగ్‌ ను ఏర్పాటు చేసింది. ఈ ఫోరమ్‌లో ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో టీడోరో ప్యానల్ డిస్కషన్‌లో మాట్లాడుతున్నారు. సౌత్ చైనా సముద్రంలో చైనా దుశ్చర్యలు, ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల  ఆవశ్యకత గురించి ఆయన ప్రసంగిస్తున్నారు. అప్పుడే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయన టేబుల్ మీద ఒక కాగితం పెట్టాడు. ఆ కాగితం తీసుకున్న టీడోరో వెంటనే తన ప్రసంగాన్ని ఆపారు. నా దగ్గర ఒక చీటీ ఉంది. ఇది చైనా నుంచి వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను దీన్ని చదవొచ్చా? అని అక్కడున్న ప్రేక్షకులను అడిగి, అందులో ఉన్నవి చదవడం మొదలుపెట్టారు. సౌత్  చైనా సముద్రంపై 2016లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్  ఇచ్చిన తీర్పును చైనా తిరస్కరిస్తోందని, ఆ తీర్పు చట్టవిరుద్ధమని అందులో రాసి ఉంది. అసలు ఆ చీటీకి, ఆ ఫోరమ్ నిర్వాహకులకు సంబంధం లేదు. సియోల్‌లోని చైనా ఎంబసీకి చెందిన ఒక మిలటరీ అటాచే  ఈ చీటీని ఒక స్టాఫ్‌కు ఇచ్చి మంత్రికి ఇవ్వమన్నాడు. ఆ స్టాఫ్ అది ఫిలిప్పీన్స్ ప్రతినిధుల నుంచి వచ్చిన మెసేజ్ అనుకుని లైవ్‌లో ప్రసంగిస్తున్న మంత్రికి ఇచ్చాడు. ఆ చీటీని చదివిన ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి టీడోరో అక్కడికక్కడే చైనాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ చీటీలో  ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల కింద ఫిలిప్పీన్స్ తీసుకొచ్చిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ తీర్పునకు  కట్టుబడి ఉండే శక్తి లేదు అని ఉంది. దానికి టీడోరో బదులిస్తూ..  అవును, ఎందుకంటే మీరు అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉండటానికి ఇష్టపడటం లేదు కాబట్టి  అని కౌంటర్ ఇచ్చారు. అలాగే, చైనా ఆ తీర్పును అంగీకరించదు, గుర్తించదు అని ఆ చీటీలో ఉండటంతో.. అఫ్కోర్స్, మీరు ఆ కేసులో ఓడిపోయారు కాబట్టి ఆ తీర్పును మీరు గుర్తించరు. వాస్తవం ఏంటంటే మీకు దక్షిణ చైనా సముద్రంపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదు  అని మొఖం మీదే కుండబద్దలు కొట్టారు. 2016లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ చైనా వాదిస్తున్న  నైన్-డాష్ లైన్   ను తప్పుబడుతూ, అది ఫిలిప్పీన్స్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ చైనా ఆ తీర్పును బేఖాతరు చేస్తూ.. అక్కడ కృత్రిమ దీవులను నిర్మిస్తూ, ఫిలిప్పీన్స్ నౌకలపై దాడులకు పాల్పడుతోంది. అదే విషయాన్ని టీడోరో గ్లోబల్ వేదికపై ఎడిపారేశారు. ఇలా మరో దేశపు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని చీటీలు పంపడంపై టీడోరో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కేవలం చట్టపరమైన వివాదం కాదు. ఒక అంతర్జాతీయ ఫోరమ్‌ లో రక్షణ మంత్రి మాట్లాడుతుంటే ఇలా చీటీ పంపడం ఈ సదస్సును నిర్వహిస్తున్న సౌత్ కొరియాకు, ఇక్కడున్న ప్రేక్షకులకు చైనా ఏమాత్రం మర్యాద ఇవ్వలేదని విమర్శలు వచ్చాయి.  చైనాకు కనీస మర్యాద,బేసిక్ సెన్స్ బిహేవియర్  లేవని, ఇలాంటి సదస్సుల్లో ఎలా ప్రవర్తించాలో చైనా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎద్దేవా చేశారు. ఇది గ్రే జోన్ కాదు.. డైరెక్ట్ గా  చైనా చేస్తున్న బలవంతపు చర్యలు, వేధింపులు అని స్పష్టం చేశారు. స్వతంత్ర ప్రేక్షకుల ముందు చైనా వైఖరిని ఎండగట్టారు. ఆ చీటీ తెచ్చిచ్చిన చైనా అధికారిని  ఉద్దేశించి మంత్రి టీడోరో ఒక అదిరిపోయే పంచ్ వేశారు.  నువ్వు మీ దేశానికి చాలా గొప్ప సేవ చేశావు.  థ్యాంక్యూ.. కానీ దీనికి ప్రతిఫలంగా నిన్ను  సోవియట్ కాలం నాటి అత్యంత కఠినమైన జైలుకు  పంపించరని ఆశిస్తున్నాను అని వ్యంగ్యంగా అనడంతో ఫోరమ్‌లోని ప్రేక్షకులంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ సంఘటన మొత్తం కెమెరాల్లో రికార్డ్ అయ్యి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో చైనా విదేశాంగ శాఖ తీవ్ర ఇరకాటంలో పడింది. ఆ చీటీకి సంబంధించిన వివరాలు తమకు తెలియవని కవర్ చేసుకుంటూనే.. దక్షిణ చైనా సముద్రంపై తమ వైఖరి ఎప్పుడూ ఒకటే అని బుకాయించే ప్రయత్నం చేసింది. ఒక దేశ రక్షణ మంత్రిని ఓపెన్ ఫోరమ్‌లో భయపెట్టాలని చూసిన చైనా.. తిరిగి అదే మంత్రి చేతిలో తీవ్ర అవమానాన్ని మూటగట్టుకుంది. చైనా బుల్లియింగ్  కు చిన్న దేశాలు ఇక భయపడే ప్రసక్తే లేదని ఈ సంఘటన నిరూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *