అంతర్జాతీయ మార్కెట్లో చైనా వస్తువులపై ఉన్న రెప్యుటేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, అది చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అయితే సరే అనుకోవచ్చు. కానీ దేశాన్ని రక్షించాల్సిన సైనికులు వాడే భారీ మిలటరీ ఆయుధాలు, యుద్ద ట్యాంకులు కూడా ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇప్పుడదే జరిగింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో చైనా తయారు చేసిన ఆయుధాల డొల్లతనం మరోసారి బయటపడింది. బంగ్లాదేశ్ సైన్యం ఫైరింగ్ విన్యాసాలు చేస్తున్న సమయంలో, చైనాకు చెందిన ఒక భారీ టైప్-59 యుద్ధ ట్యాంక్ ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు బంగ్లాదేశ్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్ సైన్యం చటోగ్రామ్ ప్రాంతంలో ఉన్న హతజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో లైవ్-ఫైర్ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ విన్యాసాల్లో చైనాకు చెందిన టైప్ 59 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ కూడా పాల్గొంది. సైనికులు ఆ ట్యాంక్ లోపల కూర్చుని ఫైరింగ్ డ్రిల్స్ చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ట్యాంక్ లోపల ఉన్న ఇద్దరు క్రూ మెంబర్స్ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. ఒక సైనికాధికారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం, ఆ అధికారిని హెలికాప్టర్ ద్వారా ఢాకాలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ కు తరలించారు. ఈ దుర్ఘటనపై బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ అధికారికంగా స్పందించింది. ఇదొక ఊహించని ప్రమాదమని, దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని ఐఎస్పీఆర్ ప్రకటించింది.
ఈ ఘటనతో చైనా ఆయుధాల నాణ్యతపై మరోసారి గ్లోబల్ స్థాయిలో తీవ్రమైన చర్చ మొదలైంది. చైనా తయారు చేసే డిఫెన్స్ హార్డ్వేర్ చాలా చవకగా లభిస్తుండటంతో బంగ్లాదేశ్, ఆఫ్రికా దేశాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటాయి. కానీ చీప్ అండ్ బెస్ట్ అనుకుని కొన్న ఆ దేశాలకు ఆ ఆయుధాలు ఇలా పనిచేస్తుండడం ఆలోచించాల్సిన విషయమే. గతంలో పాకిస్తాన్ చైనా నుంచి కొన్న ఎన్నో ఫైటర్ జెట్స్ గ్రౌండ్ కే పరిమితం అయ్యాయి. అలాగే కొన్ని ఆఫ్రికా దేశాలు కొనుగోలు చేసిన చైనా డ్రోన్లు ఏమాత్రం పనిచేయలేదు. ఇప్పుడు ఏకంగా లైవ్ ఫైరింగ్ సమయంలో బంగ్లాదేశ్ సైనికులు ఉన్న ట్యాంక్ పేలిపోవడం అంటే.. చైనా ఆయుధాల మీద విశ్వాసం తగ్గుతోంది. భౌగోళిక రాజకీయాల పరంగా చూస్తే బంగ్లాదేశ్ తమ సైనిక అవసరాల కోసం ఎక్కువగా చైనా పైనే ఆధారపడుతోంది. కానీ తాజా పరిణామం బంగ్లాదేశ్ సైనిక అధికారుల్లో గుబులు రేకేత్తిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ ఈ ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసింది.