సమాజంలో కోట్లాది రూపాయిల ఆస్తులు, సుఖసంతోషాలు ఉన్న కొందరు సంపన్నులు తమ సుఖవంతమైన సౌకర్యాలు వదులుకుని, భిక్షాటన చేస్తూ లేదా కఠోరమైన దీక్షలు చేపడుతూ వార్తల్లో నిలవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. కొందరు డబ్బు, హోదా కోసం నిరంతరం శ్రమిస్తుంటే, ఇలా వీరు మాత్రం వాటన్నింటినీ తృణప్రాణంగా భావించి విడిచిపెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా జైన మతంలో కనిపించే ‘దీక్ష’ లేదా ‘సన్యాసం’ స్వీకరించే ఘట్టాలు ఇందుకు ప్రధాన నిదర్శనంగా నిలుస్తాయి. ఇలాంటి నిర్ణయాల వెనుక ప్రధానమైన కారణం ఆధ్యాత్మిక తృప్తి అని పలువురు చెబుతున్నారు. భౌతిక విషయాలు అందించే సంతోషం తాత్కాలికమేనని, శాశ్వత ప్రశాంతత కేవలం త్యాగం మరియు జ్ఞానాన్ని సాధించడం ద్వారానే సాధ్యమని కొందరి విశ్వాసం. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు ఉన్నవారు కూడా అన్నింటిని త్యజించి ఈ దిశగా అడుగులు వేస్తారు. ఈ మార్పు వారి మానసిక ధృడత్వానికి, త్యాగ నిరతికి దర్పణంగా నిలుస్తుంది.
ఇలాంటి వార్తలు సమాజంపై, ముఖ్యంగా నేటి యువతపై తీవ్ర ప్రభావం చూపుతాయి. డబ్బు, హోదా మాత్రమే జీవితంలో అన్నీ కాదనే విషయాన్ని ఇవి గుర్తుచేస్తాయి. ఒకవైపు సమాజంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్న తరుణంలో, కోట్లు ఉన్నవారు కూడా చివరికి కోరుకునేది మనశ్శాంతినే అనే నిజాన్ని ఈ ఘటనల వలన అర్ధమవుతుంటోంది. ఇక తాజాగా మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా తాను చేసిన ఒక పనితో వార్తల్లో నిలిచారు.ఆ రాష్ట్రంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో ఒకరైన ఆయన బిచ్చగాడిలా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆశ్యర్యపోయారు. ఆయనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కామెంట్స్ కూడా చేస్తూ చర్చించుకుంటున్నారు. దీని వెనుక ఉన్న అసలు విషయం ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పినట్లుగా చేసినట్లు తెలుస్తోంది. ఘాట్కోపర్ ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే, వ్యాపారవేత్త అయిన పరాగ్ షా తన ఆధ్యాత్మిక గురువు సూచనతో జైన సంప్రదాయంలోని ఓ ప్రత్యేక మాసంలో ఇటీవల ఒకరోజు భిక్షగాడిగా దీక్ష చేపట్టారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా వేషం వేసుకొని, నియోజకవర్గంలోని వీధుల్లోనే రోజంతా తిరిగారు. దొరికింది తింటూ, రోడ్లపైనే విశ్రమించారు. ఈ దీక్ష చేపట్టడం వల్ల తనకు జీవితం అంటే ఏంటో అర్థమయ్యిందని ఆయన తెలిపారు. ఇలా తాను చేసిన పనితో ఆయన వార్తల్లో నిలిచారు.