ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు…స్పందించిన హరీష్,కె.టి.ఆర్ 

Spread the love

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మీద అనర్హత వేటు వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  ఇక బిఆర్‌ఎస్ టికెట్‌ పై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌ లో చేరి ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి, స్పీకర్ నిర్ణయం ఆయనకు రక్షణ కల్పించేలా ఉందని  ఇప్పుడు హైకోర్టు జోక్యంతో స్పీకర్ తీరుపై తీవ్రమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయని దీనిపై స్పందిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ దానంతోపాటు పార్టీ మారిన ఇతర ఎమ్మెల్యేల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకవైపు దేశమంతా తిరుగుతూ రాజ్యాంగ పరిరక్షకుడిగా మాట్లాడుతుంటారు.  పైగా కాంగ్రెస్ 2024 మేనిఫెస్టోలో పదవ షెడ్యూల్‌ను సవరించి, పార్టీ మారితే ఆటోమేటిక్‌ గా అనర్హత వేటు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. మరి ఆ చేరికలు కాంగ్రెస్‌ దగ్గరకు వచ్చేటప్పటికీ రాజ్యాంగం పట్ల వారికున్న ఆ కట్టుబాటు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో, స్పీకర్ ఇప్పటికైనా రాజ్యాంగం మరియు చట్ట నిబంధనలకు లోబడి మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత పిటిషన్లపై చర్యలు తీసుకోవాలన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగాన్ని పరిరక్షించడంపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిచేత రాజీనామా చేయించి, మళ్లీ ప్రజా తీర్పు కోరేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించాలన్నారు. రాజ్యాంగం పట్ల వారి కట్టుబాటు నిజమైనదా, లేక రాజకీయ ప్రయోజనాలను బట్టి మారుతుందా? అని ప్రశ్నించారు. ఇక బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై గౌరవ హైకోర్టు ఈరోజు అనర్హత వేటు వేసింది.మిగిలిన ఫిరాయింపుదారులకు కూడా త్వరలోనే ఇదే గతి పడుతుందని ఆయన పేర్కొన్నారు. 

దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారని, 2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారని అందులో పేర్కొన్నారు. 10వ షెడ్యూల్ ప్రకారం కాకుండా, రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కు  ప్రూఫ్స్ సమర్పించామని, వాటిని పరిగణనలోకి తీసుకోలేదని  సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్ ట్రైబ్యునల్ మార్చి 11న ఉత్వర్వులిచ్చిందని కోర్టు దృష్టికి తెచ్చారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *