గడిచిన కొద్ది సంవత్సరాలుగా అత్యున్నత నిర్మాణ విలువలతో భారతీయ సినిమా స్థాయి హాలీవుడ్ ను తలదన్నేలా నిలుస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో భారతీయ సినిమాలు అదరగొడుతున్నాయి. ప్రస్తుతం భారత్ నుండి చరిత్రలోనే ముందెన్నడూ చూడని అతిపెద్ద బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ రామాయణ . దంగల్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ఇది. శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రావణాసురుడిగా పాన్ ఇండియా సెన్సేషన్ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. 800 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో డీఎన్‌ఈజీ వాళ్లు విజువల్ ఎఫెక్ట్స్ అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ఆడియన్స్ కోసం ఒక స్పెషల్ వెర్షన్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. విదేశీయుల కోసం రిలీజ్ చేసే ఇంటర్నేషనల్ వెర్షన్ లో ఏకంగా 30 నిమిషాల సినిమాను కట్ చేయబోతున్నారట. మన ఆడియెన్స్ కు వెస్ట్రన్ ఆడియన్స్ కు ఉండే టేస్ట్ కి చాలా తేడా ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. అందుకే ఇంగ్లీష్ లో రిలీజ్ అయ్యే గ్లోబల్ వెర్షన్ లో, సుమారు 30 నిమిషాల మేర ఎమోషనల్ , డ్రామా సీన్స్ ను పూర్తిగా ట్రిమ్ చేసి, ఒక హాలీవుడ్ యాక్షన్ రేంజ్ లో ఎడిట్ చేయబోతున్నారు. కథలోని మెయిన్ సోల్ మాత్రం ఏమాత్రం మిస్ కాకుండా, స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా ఉండేలా ఈ కట్ ను రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రపంచంలోనే అత్యుత్తమ మ్యూజిక్ డైరెక్టర్, రెండు సార్లు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న లెజెండ్ హన్స్ జిమ్మర్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఆయనతో పాటు మన ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ కూడా కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఆస్కార్ విన్నింగ్ కంపెనీ DNEG కి బాధ్యతలు అప్పగించారు. మన దేశంలో రిలీజ్ అయ్యే హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లలో మాత్రం అద్భుతమైన పాటలు ఉంటాయి. విదేశీ ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ వెర్షన్‌లో పాటల సన్నివేశాలను తొలగిస్తారని, అయితే భారతీయ విడుదలలో పూర్తి సంగీత అనుభూతిని కొనసాగిస్తారని సమాచారం. ఇటు ఇండియన్ ఆడియన్స్ ను మెప్పిస్తూనే, అటు గ్లోబల్ స్టాండర్డ్స్ కు ఏమాత్రం తగ్గకుండా ఒకే సినిమాను రెండు డిఫరెంట్ ఫార్మాట్స్ లో రిలీజ్ చేయడం నిజంగా ఒక సాహసోపేతమైన ప్రయోగం. ఈ వ్యూహం గనుక సక్సెస్ అయితే, భవిష్యత్తులో మన పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా ఇదే మోడల్ ను ఫాలో అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.