600 ఏళ్ల నాటి మసీదు గోడ కోసం అల్లర్లు..ఉజ్జయినిలో అసలేం జరుగుతోంది?

Spread the love

ఉజ్జయిని.. మధ్యప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్ర నగరం. ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కొలువుదీరిన మహాకాళేశ్వర క్షేత్రం ఇది. భక్తి, ఆధ్యాత్మికత, ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే ఈ నగరంలో తాజాగా చోటుచేసుకున్న ఉద్రిక్తత చర్చనీయంశమైంది. రాబోయే సింహస్థ కుంభమేళా కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులు.. ఈ నగరంలో భారీ మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. 2028లో ఉజ్జయినిలోని పవిత్ర  క్షిప్రా నది తీరంలో సింహస్థ కుంభమేళా జరగనుంది. ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది.

ఇందులో భాగంగా నగరంలోని ప్రధాన మార్గాల్లో రహదారులను విస్తరిస్తున్నారు. అయితే, ఈ విస్తరణ మార్గంలో ఉన్న సుమారు 600 ఏళ్ల నాటి పురాతన షాహీ మసీదు కాంప్లెక్స్‌లో కొంత భాగమైన  ప్రహరీ గోడ , ఇతర కట్టడాలు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. అధికారులు జేసీబీలతో వెళ్లి ఆ కాంప్లెక్స్ లోని కొంత భాగాన్ని కూల్చివేస్తున్న సమయంలో.. వందలాది సంఖ్యలో గుమిగూడిన జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి, మున్సిపల్ అధికారులపైకి భారీగా రాళ్లు రువ్వారు. ఈ ఆకస్మిక దాడితో ఉజ్జయిని రోడ్లు రణరంగాన్ని తలపించాయి. అల్లరిమూకలను చెదరగొట్టడానికి పోలీసులు వెంటనే టియర్ గ్యాస్  ప్రయోగించారు, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్వల్ప లాఠీఛార్జ్ చేశారు. ముందు జాగ్రత్తగా ఘటనా స్థలంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్  సహా భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు.

అభివృద్ధి పేరుతో మతపరమైన కట్టడాలను టచ్ చేసినప్పుడు పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో ఈ ఘటన ద్వారా తెలుస్తోంది.   అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం. అధికారులు ఈ మసీదును ఏదో రాత్రికి రాత్రే ఏకపక్షంగా వచ్చి కూల్చేయలేదు. గత కొంతకాలంగా మసీదు కమిటీ ప్రతినిధులతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఫైనల్ గా ఆ మసీదు కమిటీ ప్రతినిధుల సమక్షంలోనే, వారి పూర్తి సమ్మతితోనే ఈ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మరి మసీదు పెద్దలే ఒప్పుకున్నప్పుడు.. ఈ రాళ్ల దాడి చేసిన వారెవరు? కొందరు ఉద్దేశపూర్వకంగానే అల్లరిమూకలను రెచ్చగొట్టి, నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడికి పాల్పడిన వారిని డ్రోన్లు, సీసీటీవీ దృశ్యాల ద్వారా పక్కాగా గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రదీప్ శర్మ వార్నింగ్ ఇచ్చారు. ఉజ్జయినిలో జరిగిన ఈ రాళ్ల దాడి, లాఠీఛార్జ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ తీవ్రంగా స్పందించారు. 600 ఏళ్ల నాటి చారిత్రక కట్టడాన్ని అభివృద్ధి పేరుతో కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రోడ్డు విస్తరణ అవసరమైతే మసీదుకు వ్యతిరేక దిశలో ఉన్న వేరే వైపు స్థలాన్ని సేకరించాలని, మైనార్టీల మనోభావాలను గౌరవించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉన్న సమయంలో ప్రభుత్వం ఏకపక్షంగా ఇలా కూల్చివేతలకు పాల్పడటం సరికాదన్నారు. మసీదును పదేపదే ముట్టడించడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వారసత్వ ప్రదేశాన్ని కూల్చివేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము  అని ఆయన ఘాటు విమర్శలు చేశారు. అయితే రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్న సమయంలోనే.. ఉజ్జయిని నగర ఖాజీ  ఖాలికుర్ రెహ్మాన్ ఒక బాధ్యతాయుతమైన ప్రకటన చేశారు. ముస్లింలు ఎవరూ సంయమనం కోల్పోవద్దని, శాంతియుతంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మసీదుకు సంబంధించిన అంశంపై అధికారులతో రాత్రికి రాత్రే చర్చలు పూర్తయి పరిష్కారం లభించిందని.. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎవరూ కూడా రోడ్లపైకి లేదా మార్కెట్ ఏరియాల వైపు గుంపులు గుంపులుగా రావద్దని తన వర్గం ప్రజలను కోరారు. మత పెద్దలే స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. 2028 సింహస్థ కుంభమేళా అనేది ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం. దీనికోసం కేవలం ఈ ఒక్క మసీదునే కాదు.. ఉజ్జయిని నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం అధికారులు ఏకంగా 272 నిర్మాణాలను కూల్చివేతకు గుర్తించారు. ఇందులో హిందువుల ఇళ్లు, దుకాణాలు కూడా చాలా ఉన్నాయి.  అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ విస్తరణ ప్రాజెక్టు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి.. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా  ఆయన పురాతన ఇల్లు కూడా కొంత పోతుండటంతో.. అధికారులను ఏమాత్రం అడ్డుకోకుండా, స్వయంగా తన చేతులతోనే తన పురాతన ఇంటిని కూల్చివేతకు అనుమతించారు. నగర అభివృద్ధికి, కుంభమేళా ఏర్పాట్లకు మతం, స్వార్థం చూడకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. సాక్షాత్తూ సీఎం తన ఇంటినే త్యాగం చేసినప్పుడు.. మసీదు కాంప్లెక్స్ లోని కొంత భాగం పోతే అందులో రాజకీయం చేయడం ఎందుకు అని బీజేపీ నేతలు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *