భారతీయ సినిమా చరిత్రలోనే ముందెన్నడూ చూడని రీతిలో, అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రామాయణ. ‘దంగల్’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు నితీశ్ తివారీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ను చేతుల్లోకి తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే ఇన్నాళ్లూ కేవలం లీకులతోనే సరిపెట్టుకున్న అభిమానులకు.. తాజాగా ఒక అదిరిపోయే అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక సర్ ప్రైజింగ్ అప్డేట్ ఇస్తూ, రామాయణ పార్ట్ 1 కి సంబంధించిన పవర్ ఫుల్ టైటిల్ ను పోస్టర్ ను రివీల్ చేశారు. రణ్‌బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఒక పవర్ ఫుల్ టైటిల్ పోస్టర్ ను వదిలింది. రామాయణను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ ముందే ప్రకటించారు. అందులో ఫస్ట్ పార్ట్ కు ఇప్పటివరకు రామాయణ: పార్ట్-1 అనే వర్కింగ్ టైటిల్ నే వాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తొలి భాగానికి మేకర్స్ అధికారిక టైటిల్‌ను ప్రకటించారు. ఫస్ట్ పార్ట్ కు రామాయణ.. రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కేవలం ఒక ఇమేజ్ మాత్రమే కాదు, అందులో రామాయణ కావ్యపు సారాంశం మొత్తం దాగి ఉంది. ఈ పోస్టర్ లో ఒకవైపు ధర్మానికి ప్రతీకైన రాముడిగా రణ్‌బీర్ కపూర్ పాత్ర థీమ్ ను, మరోవైపు రావణుడిగా యశ్ పాత్రను అద్భుతంగా హైలైట్ చేశారు. ఇద్దరి పాత్రలను, వారి మధ్య జరగబోయే ఆ మహా యుద్ధాన్ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ కు ఏమాత్రం తగ్గని భారీ విజువల్స్, గ్రాండ్ మేకింగ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ పోస్టర్ కు మేకర్స్ జోడించిన క్యాప్షన్ కూడా అద్భుతంగా ఉంది. మానవాళి చరిత్రలో అత్యుత్తమ కథకు ప్రాణం పోస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వీఎఫ్ఎక్స్ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయని, రామాయణ కాలం నాటి అనుభూతిని ప్రేక్షకులు చూపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామాయణ కావ్యాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. పార్ట్ 1 లో సీతాపహరణం వరకు, ఆ తర్వాత పార్ట్ 2 లో రామ-రావణ యుద్ధం ఉండేలా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారట. ఇందులో తొలి భాగం అయిన రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ ను దీపావళి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు బలంగా వినిపిస్తోంది. రాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు వచ్చిన రోజే దీపావళి అని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి పవిత్రమైన పండుగ రోజున ఈ సినిమా రిలీజ్ అయితే, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ రావడం ఖాయంమనే అభిప్రాయాలు సినీ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి.