ఆ ఎమ్మెల్యేకి అమాత్య యోగం దక్కేనా..?

Spread the love

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ‌ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. అమాత్య యోగం లభించేదెవరికి అన్నది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారా? విధేయతకు పట్టం పడతారా? అన్న దానిపై అధికార పార్టీలోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణపై సాగతీత కాంగ్రెస్ లోని ఆ జిల్లా సీనిర్ ఎమ్మేల్యేను తీవ్ర అసహనానికి గురిచేస్తోందా? ఆ సీనియర్ ఎమ్మెల్యే తో పాటు .. పార్టీ కేడర్ సైతం ఎదురుచూస్తూ బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతొందా? బెర్త్‌ ఖాయం అని వార్తలు వినిపిస్తున్నా ఇంకా అయోమయం తొలగలేదా? అసలు ఈసారైనా ఆ ఎమ్మెల్యేకి ఛాన్స్ దక్కుతుందా? ఆయనకు అధిష్టానం అమాత్య బాధ్యతలు అప్పచెప్పుతుందా? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రాకార్డ్ .

నిజామాబాద్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది నియోజకవర్గాలలో నాలుగు స్థానాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగతా మూడు బీజేపీ గెలుచుకోగా రెండు స్థానాలకు బీఆర్ఎస్ పరిమితమైంది. అందులో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో వ్యవసాయ సలహాదారుగా పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరింది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంత్రిగా పనిచేశారు.. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా నిజామాబాద్ జిల్లాకి మంత్రి పదవి దక్కలేదు.దీంతో అదిగో ఇదిగో అని ఊరిస్తున్నా అమాత్య పదవిపై సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. సామాజిక వర్గాల కోణంలో కొంత ఇబ్బందులు దాటి మంత్రి పదవి పక్కా అనే సమాచారం తో సుదర్శన్ రెడ్డి ఆశల పల్లకిలో ఊరేగుతూనే ఉన్నారని సమాచారం.కానీ పార్టీ నుంచి అనౌన్స్ మెంట్ లేకపోవడంతో తీవ్ర మనోవేధనకు గురవుతున్నారని టాక్.

1989లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్ శాసనసభ నియోజకవర్గం నుండి 9289 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ లోకి అడుగు పెట్టారు సుదర్శన్ రెడ్డి . 2004, 2009లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బోధన్ లో రికార్డు నెలకొల్పారు. 2009లో వై.యస్.రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.. 2023లో జరిగిన ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు.. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీ లో విధేయుడుగా, నిబద్ధుడిగా ఉన్నప్పటికీ తొలిదశలో మంత్రి పదవి రాకపోవడం పై సుదర్శన్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారట. ఇంత సీనియర్ లీడరైన తనకు మంత్రి పదవి ఇవ్వడంలో ఇంత నాన్చడం ఏమిటని ఆయన తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఉమ్మడి జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే. అందుకే ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ అని అందరూ భావించారు. తొలి దశలోనే తిరుగుండదని అంతా అనుకున్నారు.. కానీ మొదటి దశలో మంత్రి పదవి రాకపోవడం సుదర్శన్ రెడ్డిని ఆయన వర్గీయులను కాంగ్రెస్ క్యాడర్ ను తీవ్ర నిరాశకు గురిచేసిందట.. అప్పటినుంచి సుదర్శన్ రెడ్డి నారాజుగానే ఉన్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు.

నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో ఒకింత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి కుంటుపడిందనే విమర్శలు జనాల నుంచి వ్యక్తమవుతున్నాయి.. ఏడాదిన్నరగా జిల్లాకు మంత్రి లేకపోవడంతో అభివృద్ధి నిధుల విషయంలో ఎవరిని సంప్రదించాలో అర్థం కాక ఎమ్మెల్యేలు నాయకులు తలలు పట్టుకుంటున్నారట.. మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు జడ్పీలు స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీ కాలం ముగిసి కూడా నెలలు కావస్తుంది. దీంతో జిల్లాలో ఆ లోటు కూడా ఉండడంతో రాజకీయ స్తబ్దత ఏర్పడినట్లైంది. నామినేటెడ్ పోస్టుల కోసం కూడా క్యాడర్ ఎదురుచూస్తూనే ఉంది.. పార్టీ కార్యవర్గం పోస్టుల కోసం కూడా నాయకులు వేయికళ్లతో ఆశగా చూస్తున్నారు..

నిజామాబాద్ జిల్లాకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన జిల్లాకు వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలపై సమీక్షలు జరుగుతున్నాయని జిల్లాలో చర్చ జరుగుతోంది. మిగతా సమయాల్లో మళ్లీ అదే తంతు కొనసాగుతోందట. అందుకే జిల్లాకు ఓ మంత్రి పదవి కేటాయిస్తే ఇక్కడే మంత్రి అందుబాటులో ఉంటారని, తమ సమస్యలు వింటారని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.