ఆళ్ల నాని ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Spread the love

ఆ జిల్లాలో ఆయన బలమైన నాయకుడు.. పార్టీ ఏదైనా పెత్తనం తనదే.. సినిమాల ప్రభావంతో ఆ పక్కా నాదే ఈ పక్క నాదే అనే టైప్ ఆయన. రాజకీయాల్లో కూడా ఏ పార్టీ అయినా ముఖ్య నాయకులంతా ఆయన వైపే..మాజీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. పార్టీ మారిన తర్వాత జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తన అనుచర వర్గాన్నంతటిని సిద్ధం చేసుకుంటున్నారట. ఇంతకీ ఎక్కడ ఆ జిల్లా? ఎవరా నాయకుడు? ఏంటి ఆయన హవా? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల కాళీ క్రిష్ణ శ్రీనివాస్ బలమైన నాయకుడిగా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం వరకు కాపు సామాజిక వర్గంలో తనదైన శైలిలో పట్టు సాధించారు ఆళ్ల నాని. వరుసుగా ఏలూరు నియోజకవర్గం నుంచి కాగడా గుర్తుతో ఒకసారి.. కాంగ్రెస్ ఒకసారి ..వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లు విజయం సాధించారు . 2019 నుంచి 2024 వరకు ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నప్పటికీ …జనసేనలో చేరడానికి తెగ ప్రయత్నాలు చేశారంట. కానీ ఆఖరికి టిడిపిలో డేట్లు ఫిక్స్ అవ్వక నానా తంటాలు పడి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు ఆళ్ళ నాని.

ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నానికి ఓ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు అన్న పేరు కూడా ఉంది. ఇక టిడిపిలో జాయిన్ అయిన తర్వాత అధ్యక్ష పదవి హామీ తీసుకొని పార్టీలో జాయిన్ అయ్యారని ఓ వర్గం వారు అనుకుంటున్నారు. అందులో భాగంగానే తను పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందే తన ముఖ్య అనుచరులను సైకిల్ ఎక్కించారట ఆళ్ల నాని. మిగిలిన వారిని… తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ సభను ఏర్పాటు చేసి ఆ సభలో జాయిన్ అవ్వడానికి ముహూర్తాలు పెట్టుకుంటున్నారట . అయితే ప్రస్తుతం జిల్లా అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజనేయులు నామినేటెడ్ పదవి తీసుకోవడంతో ఈ మధ్యకాలంలోనే నాని గన్ని వీరాంజనేయులు శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లి మంతనాలు జరిపారట. దీంతో ఏలూరు నియోజకవర్గంలోని కొంతమంది టీడీపీ పెద్దలు వైసీపీలో ఉన్న టిడిపి అనుకూల వర్గానికి మంతనాలు జరుపుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు.

ఇప్పటికే జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ దంపతులు.. వైసీపీ నుంచి టిడిపి తీర్థం పుచ్చుకొని ప్రభుత్వ మీటింగుల్లో ప్రోటో కాల్ ఇవ్వట్లేదు అంటూ తమను గుర్తించట్లేదంటూ లబోదిబోమంటున్నారు . అయితే టిడిపి చేపట్టిన మహానాడుకి ముందు గంట ప్రసాద్ ఆళ్ల నానికి రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్ప చెప్తారని మహానాడులో కూడా ప్రాముఖ్యత కల్పిస్తారని ఓవర్గం ప్రచారం చేశారు. అయితే ఆళ్ల నాని టిడిపి తీర్థం పుచ్చుకోకముందే ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్ష బాధ్యతలు తనకు ఇవ్వాలని కోరినట్లు ఆ హామీ మీదనే లోకేష్ తో మంతనాలు జరిపి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో జాయిన్ అయ్యారని ఆళ్ళనాని వెంటే మిగిలిన వైసీపీ నాయకులందరూ కూడా నడుస్తారు అంటూ గట్టిగా చర్చ సాగుతుంది.

ఆళ్ల నాని మాత్రం తను ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయను అంటూ తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని టిడిపి అధిష్టానాన్ని కోరినట్లు కొంతమంది సన్నిహితుల దగ్గర అన్నారట. ఇక ఆళ్ల నాని అధ్యక్ష బాధ్యతలు చేపడితే మళ్లీ అప్పటి వైసీపీ వర్గమంతా హవా చాలాయిస్తుందంటూ కొంతమంది టిడిపి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట . ఏది ఏమైనాప్పటికీ నాని ది సపరేట్ స్టైల్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఒక కోటరిని ఏర్పాటు చేసుకుంటారు . దానిలో భాగంగానే ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో ఆయన పార్టీలో చేరటానికి ముందు కొంతమంది నాయకులు టిడిపిలో జాయిన్ అవ్వడం ఆయన పార్టీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఆయనతోపాటు పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఇవన్నీ కూడా నాని రాజకీయం అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి టిడిపి అధిష్టానం ఆళ్ల నానికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తుందా? లేక రాష్ట్ర బాధ్యతలను ఏమైనా కట్టబెడుతుందా అనేది వేచి చూడాలి.