
కొణిదెల…ఈ పేరు వింటే వెంటనే గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు. ఎందుకంటే.. వారి ఇంటి పేరు కొణిదెల కబట్టి. కానీ, ఈ పేరుతోనే ఒక గ్రామం ఉంది. అది కూడా ఏపీలోనే ఉంది. ఈ విషయం ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆ గ్రామానికి డిప్యూటీ సీఎం అక్షరాలా 50 లక్షల రూపాయల సాయం అందించారు. తన మాటను నిలబెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆ 50 లక్షల చెక్కును స్వయంగా జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. దీంతో ఇప్పుడు కొణిదెల గ్రామం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి అంత అమౌంట్ ఎందుకు డొనేట్ చేశారు? ఆ గ్రామ ప్రజలకు పవన్ ఇచ్చిన మాటేమిటి? అసలు ఆ గ్రామానికి పవన్ కు ఉన్న సంబంధమేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంటిపేరుతో ఉన్న కొణిదెల గ్రామం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో కొణిదెల ఓ మారు మూల గ్రామం. ఈ గ్రామంలో సుమారు 2 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. జనసేన అధినేతగా అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న క్రమంలో కొణిదెల గ్రామం గురించి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో జనసేనాని ఆ గ్రామానికి వెళ్లి అక్కడి ప్రజలను పలకరించారు. వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. ఇదే క్రమంలో కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ వారికి మాటిచ్చారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం కూటమి ప్రభుత్వం విజయం సాధించడం పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వడం జరిగిపోయాయి.
ఇదిలా ఉంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓర్వకల్ మండలంలో పర్యటించారు. అక్కడ పూడిచెర్ల గ్రామంలో ఫామ్ ఫాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ కార్యక్రమంలోనే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య తన మనసులోని మాటను పవన్ కల్యాణ్ కు చెప్పారు. కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని గతంలో ఆయన ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు. దీంతో తాను కొణిదెల గ్రామానికి ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకుంటానని అక్కడ జరిగిన సభలోనే పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. తన పర్సనల్ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయలను గ్రామానికి ఇస్తానని సభలోనే ప్రకటించారు.
ఈ మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఆయన 50లక్షల చెక్కును స్వయంగా జిల్లా కలెక్టర్ కు అందజేశారు. కొణిదెల గ్రామ అభివృద్ధికి వినియోగించాలని కోరారు. ఆ తర్వాత కలెక్టర్ రాజకుమారి ఆ చెక్కును సంబంధిత అధికారులకు అందజేశారు. గ్రామస్తుల కోరిక మేరకు నూతన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును నిర్మించాలన్నారు పవన్ కళ్యాణ్ . రోడ్లు డ్రైనేజీ వంటి మౌలిక వసతులను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారంటూ గ్రామస్థులు పవన్ కల్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలా పవన్ కళ్యాణ్ తన ఇంటి పేరుకు ఉన్న కొణిదెల గ్రామానికి ఆర్థిక సాయం అందించారు. అంతే కానీ ఆయనకు ఆ ఊరికి ఎలాంటి సంబంధం లేదు. యాదృచ్ఛికంగానే రెండింటికి ఇప్పుడు ప్రచారం వచ్చినట్లైంది.