
Tirupati Hathiramji Mutt lands: తిరుపతి నడిబొడ్డులో ఉన్న హథీరాంజీ మఠం భవన బలోపేతాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? తిరుపతి మధ్యలో ఉన్న హథీరాంజీ మఠానికి చెందిన విలువైన భూములు దాదాపు కబ్జా బారినపడినట్లేనా. మఠానికి ఆనుకుని ఉన్న షాపుల పరిస్తితి ఏంటి. కూలిపోయే స్తితిలో ఉన్న హథీరాంజీ మఠం భవనాన్ని బలోపేతం చేయడాన్ని అడ్డుకుంటుంది ఎవరు. ఇవే ఇప్పుడు తిరుపతి వాసులను వెంటాడుతున్న ప్రశ్నలు.
ఒకప్పుడు తిరుపతిలో విస్తృత స్థలాన్ని కలిగి ఉన్న హథీరాంజీ మఠం, కాలక్రమంలో పలు రాజకీయ, వాణిజ్య ఒత్తిళ్లతో తన భూములు కోల్పోయిందట. ఇప్పుడున్న కొద్ది భూముల్లో ఏర్పాటైన షాపుల నుంచే మఠానికి కొద్దోగొప్పో ఆదాయం వస్తోంది. అయితే నామమాత్రపు అద్దెలు కావడంతో వచ్చే ఆదాయం మఠం నిర్వహణకు కూడా చాలడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక మఠం భవనం పురాతనమైంది. కూలిపోయే పరిస్తితిలో ఉందట. అయినా దాని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఓ వ్యక్తి పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాతే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిపుణుల సహాయంతో భవనాన్ని పరిశీలించింది. వారి నివేదిక ప్రకారం, భవనం బలహీనంగా మారిందనీ, ప్రజల ప్రాణాలకే ముప్పని నిర్ధారించింది. కానీ, ఇది పూర్తిగా కూల్చాల్సిన అవసరం లేదనీ, బలోపేతం ద్వారా భద్రతను అందించవచ్చని స్పష్టం చేసింది.
ఈ మఠాన్ని ఇప్పటికే ఐఐటి నిపుణులు కూడా పరిశీలించారట. మఠం పూర్తిగా పడిపోక ముందే దానికి సరైన మరమ్మత్తులు చేయాలంటే దానికి ఆనుకొని ఉండే షాపులను తొలగించి అదే ప్రాంతంలో మరల షాపులు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికుల వాదన. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైందట. కొంతమంది రాజకీయ నాయకులు వ్యాపారుల నుంచి దాదాపుగా 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. వారే ఇప్పుడు హథీరాంజీ మఠం భవనాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నట్లు తిరుపతిలో ప్రచారం జరుగుతోంది. Tirupati Hathiramji Mutt lands.
ఎందుకంటే ఒక్కసారి షాపులు ఖాళీ చేసి మళ్లీ వస్తే, మఠం షాపుల అద్దెను ఎక్కువ చేస్తుందన్న భయం వ్యాపారులకు పట్టుకుందట. అందుకే అసలు ఖాళీ చేయకుండా ఉంటే బెటరన్న ఆలోచనతో రాజకీయ నేతలకు డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరికొన్ని అనుమానాలు కూడా స్థానికులను వెంటాడుతున్నాయట. భవనాన్ని బలోపేతం చేయాలన్న ప్రణాళికను వ్యాపారులు అడ్డుకోవడం ఒకటైతే, ఖాళీ చేసిన వ్యాపారులకే తిరిగి అద్దెకు ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పుడు, భవనం బలోపేతాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారన్నదే అనుమానాలకు తావిస్తోందట. ఇదే సమయంలో భవనం బలోపేతం కాకుండా చేయాలన్న స్థానిక నాయకుడి ఆసక్తి ఏంటన్నది కూడా మరో ప్రశ్నగా మారిందట. దాదాపు ఇరవై ఏళ్లుగా మఠంవారు, మునిసిపల్ అధికారులు భవనం పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నా, ప్రతిసారీ రాజకీయంగా ఆటంకాలు ఎందుకు వస్తున్నాయన్నదీ అనుమానాలను రెట్టింపు చేస్తోంది.
ఇది కేవలం ఒక భవన భద్రత సమస్య కాదు. ఇది ఒక వారసత్వ భవనాన్ని కాపాడుతూ, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించే ప్రక్రియ. దాన్ని రాజకీయ లాభాల కోసం ఆపటం సమంజసం కాదని చాలామంది భావిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ధైర్యంగా ముందుకు వచ్చి, తాత్కాలిక ఏర్పాట్లు చేసి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ భవనం కేవలం ఒక వాణిజ్య ప్రాంగణం కాదనీ, తిరుపతి చరిత్రలో ఒక భాగమని వాదిస్తున్నారు. 150 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన హథీరాంజి మఠం పరిపాలన భవనానికి పూర్తి స్థాయిలో మరమత్తులు చేయాలని స్తానికులు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా మఠం ఆదాయం పెంచడంతో పాటు ప్రస్తుతం ఉన్న వారికే తిరిగి షాపులు కేటాయిస్తే అసలు గొడవే ఉండదని చెబుతున్నారు.
Also Read: https://mega9tv.com/andhara-pradesh/telugu-desam-party-to-contest-in-zptc-election-from-pulivendula/