
Congress’s confidence in Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోష్ మీద ఉందట. జిల్లాలో నిర్వహించిన జనహిత పాదయాత్రతో కేడర్ ఉత్సాహం రెట్టింపు అవ్వడంతో, స్తానిక సంస్థల ఎన్నికల్లో తమకు తిరుగులేదని పార్టీ నేతలు సంబరపడి పోతున్నారట. ఇదే జోరు వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగించి, మరోసారి తెలంగాణాలో పాగా వేయాలన్న ఆలోచనలో ఉన్నారట కాంగ్రెస్ పెద్దలు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత కుదిరిందా అంటే దాదాపుగా ఓకే అన్న మాట వినిపిస్తోందట. మొన్నటి దాకా ఎవరికి వారే అన్న చందంగా ప్రవర్తించిన పార్టీ నేతలు, జిల్లాలో జరిగిన జనహిత పాదయాత్ర సందర్భంగా ఒకే తాటిమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా కావడంతో నేతలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక కష్టపడిన వారికే పదవులంటూ పార్టీ నాయకత్వం ప్రకటించడం కూడా జిల్లా నేతల్లో ఉత్సాహం నింపినట్లు తెలుస్తోంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ కూడా నేతల్లో నమ్మకం కలిగించేలా ప్రవర్తించడంతో పాదయాత్రలో ఐక్యత చాటారట జిల్లా కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఆర్మూర్ నియోజకవర్గంలో నిర్వహించిన జనహిత పాదయాత్ర కొత్త జోష్ నింపిందట. పార్టీతో పాటు నాయకులు ఏకతాటిపైకి వచ్చి జిల్లాలో రెండు రోజుల జనహిత పాదయాత్రను విజయవంతం చేశారన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జి మంత్రి సీతక్క నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుండి స్పందన వచ్చిందని నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారట.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో ఈ పాదయాత్ర జోష్ జిల్లాలో నేతల్లో జోష్ నింపిందని కాంగ్రెస్ నేతలు మురిసిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐదు నియోజకవర్గాల్లో రెండు చోట్ల అంతర్గత విబేధాలు ఉన్నప్పటికీ జనహిత పాదయాత్రలో అవి మచ్చుకైనా కనిపించ లేదట. జిల్లాకు చెందిన నేతలందరూ కల్సికట్టుగా పాదయాత్రలో పాల్గొనడంతో పాటు జిల్లా నాయకత్వం సైతం అందరినీ గౌరవిస్తూ యాత్రను విజయవంతం చేసినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. Congress’s confidence in Nizamabad.
ఇక ఇప్పటి దాకా మండల, గ్రామ స్తాయిలో నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు రానివారు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సమయంలో కష్టపడిన వారికే పదవులంటూ టీపీసీసీ చీఫ్ తేల్చిచెప్పడంతో అందరూ కల్సికట్టుగా పాదయాత్రలో పాల్గొన్నారట. ఇదే సమయంలో జిల్లా కాంగ్రెస్ నేతలకు కూడా మహేష్ కుమార్ గౌడ్ చేసిన హెచ్చరికలు ఫలించినట్లు తెలుస్తోంది.టీపీసీసీ చీఫ్ హెచ్చరిండం వల్లే అందరూ ఒకేతాటి మీదకు వచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
మరో విషయం ఏంటంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారికి ఎక్కువ సీట్లు దక్కాలంటే, పార్టీ పెద్దల ముందు తమ బలం చూపించాలని చాలామంది జిల్లా నేతలు డిసైడ్ అయ్యారట. అందుకే, పాదయాత్ర సమయంలో అందరూ పోటీపడి జనసమీకరణ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ దృష్టిలో పడేందుకు తెగపాట్లు పడినట్లు జిల్లా వాసులు చెప్పుకుంటున్నారు.