ట్రంప్ కు భయపడ్డ ఆపిల్ ఫోన్..?!

Spread the love

Apple CEO Golden Gift To Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానం ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. చైనాతో పాటు ఇండియాపై కూడా విధించిన టారిఫ్‌లు అనేక కంపెనీలను ఆందోళనలో ముంచెత్తాయి. ఈ ఒత్తిడిలో టెక్ దిగ్గజం ఆపిల్ కూడా ఉంది. ట్రంప్‌తో ఘర్షణ ఎందుకని అనుకున్న ఆపిల్ సీఈవో టిమ్ కుక్, అమెరికాలో కొత్త పెట్టుబడులతో ముందుకొచ్చారు. అంతేకాదు, ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు ఒక ప్రత్యేక గిఫ్ట్ కూడా అందించారు. ఇంతకీ ఆపిల్ అమెరికాలో ఎలాంటి పెట్టుబడులు పెడుతోంది? టిమ్ కుక్ ట్రంప్‌కు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి? ట్రంప్ సుంకాల వల్ల అమెరికా కంపెనీలు ఎందుకు భయపడుతున్నాయి? ఈ టారిఫ్‌లు ఏ కంపెనీలను ప్రభావితం చేస్తున్నాయి? ఇండియాలో ఆపిల్ ఉత్పత్తి హబ్‌ను అమెరికాకు మారిస్తే ఏమవుతుంది?

ట్రంప్ నోటికి బయపడి ఆపిల్ కంపెనీ తాజాగా అమెరికాలో 100 బిలియన్ డాలర్ల కొత్త పెట్టుబడులను ప్రకటించింది. దీనితో ఆ కంపెనీ యూఎస్‌లో మొత్తం పెట్టుబడులు 600 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ పెట్టుబడులు అమెరికన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రోగ్రాం కింద పెడుతున్నారు. ఇందులో దేశీయ ఉత్పత్తి, సప్లయర్ నెట్‌వర్క్, రేర్ ఎర్త్ మెటీరియల్స్, చిప్ ఫ్యాబ్రికేషన్ వంటి రంగాల్లో ప్రాజెక్టులు ఉన్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ పెట్టుబడుల ద్వారా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి. కెంటకీ, యుటా, టెక్సాస్, అరిజోనా, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో 10 కొత్త ఫ్యాక్టరీలు యాపిల్ నిర్మించనుంది. ఈ ఫ్యాక్టరీల నుంచి ఉత్పత్తి చేయబడే రెండు మూడవ వంతు భాగాలు విదేశాలకు ఎగుమతి కానున్నాయి, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చనుంది. అయితే భారత్ లో ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని అనుకున్న ఆపిల్ ట్రంప్ తీరుతో భయపడే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

అంతేకాదు.. అధికారిక పెట్టుబడులతో పాటు ట్రంప్ ను స్వయంగా ప్రసన్నం చేసుకునేందుకు గిఫ్టులు ఇచ్చింది ఆపిల్ కంపెనీ. వైట్ హౌస్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో ఆపిల్ సీఈవో టిమ్ కుక్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యేకమైన గిఫ్ట్ అందించారు. అమెరికాలో తయారైన కస్టమ్-మేడ్ సర్కులర్ గ్లాస్, అలాగే 24 క్యారెట్ గోల్డ్‌తో తయారైన బేస్ ను ట్రంప్ కు అందించారు.. దీనిపై ట్రంప్ పేరు, ఆపిల్ లోగో, టిమ్ కుక్ సంతకం ఉన్నాయి. ఈ గిఫ్ట్ అమెరికా ఉత్పత్తి సామర్థ్యానికి చిహ్నమని.., ఇలాంటిది ఒక్కటే తయారు చేశాం అని టిమ్ కుక్ పేర్కొన్నారు. ఈ గిఫ్ట్ ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆపిల్ యూ‌ఎస్‌లో ఉత్పత్తిని పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సంకేతంగా చెబుతున్నారు. Apple CEO Golden Gift To Trump.

ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత సుంకాల విధానం అనేక కంపెనీలను ఆందోళనలో పడేసింది. యూఎస్‌లో ఉత్పత్తి చేయని కంపెనీలపై 25-50% సుంకాలు విధిస్తూ, దేశీయ ఉత్పత్తి చేసే కంపెనీలకు టారిఫ్ మినహాయింపులు ఇస్తామని ట్రంప్ బెదిరించారు. ఈ ఒత్తిడి వల్ల ఆపిల్, ఇంటెల్, ఫోర్డ్, టెస్లా, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను అమెరికాకు మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. విదేశాల్లో ఉత్పత్తి చేసే కంపెనీలకు భారీ సుంకాల భయం, దేశీయ ఉత్పత్తికి ఖర్చు పెరగడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ వంటి కంపెనీలు ట్రంప్ విధానాలకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

ట్రంప్ విధించిన సుంకాలు చైనా, ఇండియా, యూరోప్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో స్మార్ట్‌ఫోన్ భాగాలు, సెమీకండక్టర్లు, కంప్యూటర్ చిప్‌లపై 25 నుంచి 100 శాతం సుంకాలు విధించారు. టెక్స్‌టైల్స్, జ్యూవెలరీ, ఆటోమొబైల్, స్టీల్, అల్యూమినియం రంగాలు కూడా ఈ టారిఫ్ బారిన పడ్డాయి. ఇండియా నుంచి దిగుమతి చేసే వస్తువులపై 50% వరకు సుంకాలు పెరిగాయి. అయితే, ఆపిల్‌కు ట్రంప్ ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. యూఎస్‌లో స్మార్ట్‌ఫోన్ భాగాలు ఉత్పత్తి చేస్తే టారిఫ్‌ల నుంచి ఉపశమనం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానం ఆపిల్‌ను యూఎస్‌లో ఉత్పత్తిని పెంచే దిశగా నడిపించింది.

ట్రంప్ సుంకాల విధానం కంపెనీలను గందరగోళంలోకి నెట్టింది. భారీ సుంకాలు ఉత్పత్తి ఖర్చులను పెంచుతున్నాయి, దీనివల్ల లాభాలు తగ్గుతున్నాయి. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే ట్రంప్ విధానం కంపెనీలను అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించేలా చేస్తోంది, కానీ ఇది శ్రామిక శక్తి, మెటీరియల్ ఖర్చులను పెంచుతోంది. అంతర్జాతీయ సప్లై చైన్ లో బ్రేక్ లు పడి, అమెరికా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‌లో వాటాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సవాళ్ల మధ్య ఆపిల్ వంటి కంపెనీలు ట్రంప్ విధానాలకు అనుగుణంగా తమ వ్యాపార వ్యూహాలను సర్దుబాటు చేసుకుంటున్నాయి, అయితే ఈ మార్పులు దీర్ఘకాలంలో ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది అనిశ్చితంగా ఉంది.

2023-25 మధ్య ఆపిల్ కంపెనీ ఇండియాను ఐఫోన్ ఉత్పత్తి, ఎగుమతి హబ్‌గా మార్చేందుకు ఫాక్స్‌కాన్, టాటా, పెగాట్రాన్‌లతో కలిసి పెద్ద ఎత్తున ప్రణాళికలు వేసింది. ఈ ఏడాది యూఎస్‌కు వెళ్లే ఐఫోన్‌లలో ఎక్కువ భాగం ఇండియాలోనే ఉత్పత్తి అయ్యాయి. అయితే, ట్రంప్ విధించిన 25% అదనపు సుంకాలు ఇండియా నుంచి ఎగుమతులను దెబ్బతీసే అవకాశం ఉంది. సుమారు 60 మిలియన్ ఐఫోన్‌ల ఎగుమతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇండియాలో ఆపిల్ ఉత్పత్తి కేంద్రాల విస్తరణ ప్రణాళికలకు బ్రేక్ పడవచ్చు, భారత ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ఆపిల్ అమెరికాకు పూర్తిగా బదిలీ అయితే, భారత్‌లో ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది, ఇది భారత ఆర్థిక వృద్ధికి ఒక సవాల్‌గా మారవచ్చు.

Also Read: https://mega9tv.com/international/why-isnt-trump-getting-the-nobel-peace-prize-what-are-trumps-mistakes/