
Trump India Tariff: ట్రంప్ భారత్ పై పగబట్టారా..? అందుకే టారిఫ్ ల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారా..? రష్యా నుంచి ఎక్కువ శాతం ఆయిల్ చైనా కొనుగోలు చేస్తున్నా..ఆ దేశాన్ని వదిలేసి.. భారత్ పైనే అధిక సుంకాలు ఎందుకు విధిస్తున్నారు..? దీని వెనుక రష్యా నుంచి దిగుమతుల అంశం కాదు.. వేరే ఏదో ఉంది అని మాట వినిపిస్తోందా..? అసలు ట్రంప్ కు భారత్ పై ఉన్నట్టుండి .. ఇంత ద్వేషం ఎందుకు కలిగింది..?
అమెరికా గత అధ్యక్షుల దారి వేరు.. ట్రంప్ దారి వేరు. ఓ దేశ అధ్యక్షుడంటే హుందాగా ఉండాలి. కాని ట్రంప్ లో ఆ లక్షణాలు ఏమీ కనిపించవు. ఇతర దేశాల నాయకులను కించపర్చడం.. తన మాట వినకపోతే బెదిరించడం ట్రంప్ అలవాటే. అయితే ఇటీవల ట్రంప్ తీరు చూస్తుంటే భారత్ పై పగబట్టినట్టు కనిపిస్తోంది. భారత్ మిత్ర దేశం అంటూనే 50 శాతం టారిఫ్ లు విధించడం కేవలం ఆర్థిక విధానపరమైన నిర్ణయం కాకపోవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు. దీని కంటే ట్రంప్‌కు భారత్ పై వ్యక్తిగత అక్కసు.. ఇతర స్వార్థపర కారణాలు కూడా ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. దీనికి కొద్ది రోజులుగా ట్రంప్ చేసే పిచ్చి ప్రేలాపనలు, ప్రకటనలకు భారత్ తాన తందానా అనకపోవడమే కారణంగా చెబుతున్నారు..
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య సంబంధాలు ఎన్నడూ లేనివిధంగా అత్యల్పస్థాయికి దిగజారీ పోయాయి. అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించని భారత స్వతంత్రవైఖరి ట్రంప్ కు కోపం తెప్పించి ఉండొచ్చని అంటున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ మధ్య సీజ్ ఫైర్ తన వల్లే ప్రకటించారని భారత్ అంగీకరించకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. భారత్ తరచూ ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ ప్రకటనలను తిరస్కరిస్తోంది. ప్రధాని మోదీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఇందులో మూడో దేశ నాయకుడి ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. దీంతో ట్రంప్ భారత్ పై కోపం పెంచుకున్నారని భావిస్తున్నారు.
ట్రంప్ కుటుంబం పాక్ సాయంతో క్రిప్టో వ్యాపారంలోకి దిగడంతో ఇస్లామాబాద్‌తో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఆ దేశంలో చమురు అన్వేషణకు అమెరికా సంస్థలను ప్రోత్సహిస్తానని.. భవిష్యత్తులో భారత్ కూడా పాక్ నుంచి చమురు కొనే పరిస్థితి వస్తుందేమో అని కవ్వింపు ప్రకటనలు చేయడం దీనిలోని భాగమే అంటున్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ట్రంప్ ఆపారని.. ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఇప్పటికే పాక్ ప్రకటించింది. కానీ దీనికి వ్యతిరేకంగా భారత్ ప్రకటనలు ఉంటున్నాయి.
అయితే ట్రంప్ ఎంత బెదిరించినా.. భారత్ స్థిరంగా నిలబడితేనే మేలనే మాట వినిపిస్తోంది. సొంత ఈగో కోసం ట్రంప్ ఈ సుంకాలను విధిస్తే.. ఇది అమెరికాకే నష్టమని అంటున్నారు. అందుకే ఈ సుంకాల విషయంలో భారత్ దృఢంగా నిలబడితే.. ట్రంప్ వెనకడుగు వేస్తారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ తన సుంకాలతో మిత్రదేశమైన భారత్‌ను దూరం చేసుకుంటున్నారని మాజీ రిపబ్లికన్ గవర్నర్ క్రిస్ సునను అన్నారు. అమెరికా తయారీదారులను తాజా పరిణామాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఈ సుంకాల బాదుడు అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు హానికరమని నాటో అడ్వైజర్ ఎఫ్. క్రిస్టిల్ కౌర్ విమర్శించారు. ఇలా చాలా మంది అమెరికన్లు, యూరప్ దేశాల ప్రముఖులు ట్రంప్ తీరుని విమర్శిస్తున్నారు. అలాగే ట్రంప్ చర్య స్వీయ విధ్వంసానికి దారితీస్తుందని… ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలియదని… బలమైన భాగస్వామితో ట్రంప్ శత్రుత్వాన్ని సృష్టించుకుంటున్నారని పలువురు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే భారతీయులు బలంగా నిల్చుంటే.. ట్రంప్ వెనక్కి తగ్గాల్సి వస్తుందని చెబుతున్నారు. Trump India Tariff.
పైగా ట్రంప్ సుంకాల వల్ల అమెరికా ప్రజలపై కూడా భారీగా భారం పడనుందని అంచనా వేస్తున్నారు. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువుల ధరలు పెరగనున్నాయి. భారత్ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, ఆభరణాలు, ఆటోమొబైల్ భాగాలు, ఫార్మాస్యూటికల్స్ వంటి ఉత్పత్తుల ధరలు ఈ సుంకాల వల్ల పెరుగుతాయి. ఆపిల్ ఐఫోన్‌ల వంటి ఉత్పత్తులు, ఇండియాలో తయారై అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి, ఇప్పుడు ధరలు 10-20% వరకు పెరిగే అవకాశం ఉంది, దీనివల్ల సామాన్య అమెరికన్ వినియోగదారులు ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో భారత్ నుంచి వెళ్లే జనరిక్ ఔషధాల ధరలు పెరగడం వల్ల ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా పెరుగుతాయి, ఇది తక్కువ ఆదాయ వర్గాలను మరింత ఇబ్బంది పెడుతుంది. అదనంగా, సుంకాల వల్ల అమెరికా కంపెనీలు ఉత్పత్తి ఖర్చులను తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచవచ్చు, కానీ ఇది శ్రమశక్తి, మెటీరియల్ ఖర్చులను పెంచుతుంది, ఫలితంగా ఈ ఖర్చులు వినియోగదారులపైనే పడతాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, ఈ టారిఫ్‌ల వల్ల అమెరికన్లు సంవత్సరానికి సగటున వెయ్యి నుంచి రెండు వేల డాలర్ల అదనపు ఖర్చును ఎదుర్కోవచ్చు. దీర్ఘకాలంలో, ఈ సుంకాలు అమెరికా ఆర్థిక వృద్ధిని కూడా నెమ్మదించే ప్రమాదం ఉంది, వ్యాపార వేత్తగా ఈ విషయం తెలుసుకోలేనంత ముర్ఖుడు ట్రంప్ కాదని అంటున్నారు. అందుకే భారత్ స్టడీగా ఉంటే సుంకాలు తగ్గుతాయని చెబుతున్నారు.