
Trump Nobel Peace Prize: నాకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సిందే.. ఇదీ డొనాల్డ్ ట్రంప్ వాదన. బరాక్ ఒబామా అధికారంలోకి వచ్చి 9 నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్నారు కదా… అప్పుడు నేనెందుకు అర్హుడు కాను? అంటూ ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. వైట్ హౌస్ కూడా ట్రంప్ కు ఏదోలా నోబెల్ బహుమతి ఇప్పించేందుకు పడరాని పాట్లు పడుతోంది. అసలు ట్రంప్ నోబెల్ కోసం ఎందుకు ఇంత తహతహలాడుతున్నారు? అసలు ట్రంప్ కు నోబెల్ ఎందుకు రావడం లేదో గ్రహించారా లేదా ? ట్రంప్ చేసిన తప్పులు ఏంటి?
2009లో బరాక్ ఒబామా అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. మరి నాకెందుకు రాదు. నేనేం తప్పు చేశారు. ఇది ట్రంప్‌కు పెద్ద మనోవేదనగా మారింది. ఒబామాకు అంత తొందరగా ఇచ్చారు, తన ప్రయత్నాలు ఏం తక్కువగా ఉన్నాయి అంటూ ట్రంప్ పదే పదే ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్, ఇండియా-పాకిస్తాన్ వంటి దేశాల మధ్య శాంతి ఒప్పందాలకు తానే దౌత్యం చేశానని, అందుకు నోబెల్ బహుమతి తనకు రావాలని ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. వైట్ హౌస్ కూడా ఈ విషయంలో ఆయనకు బలమైన మద్దతు ఇస్తోంది. కాని ట్రంప్ చేసిన తప్పుల కారణంగానే నోబెల్ బహుమతి ఇవ్వలేదని చెబుతున్నారు.
ట్రంప్ తన మొదటి హయాంలోనూ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నోబెల్ శాంతి బహుమతికి చాలా నామినేషన్లు వేయించారు. అవి తిరస్కరణకు గురైనా పట్టు వదలని విక్రమార్కుడిలా నోబెల్ కు నామినేషన్లు పంపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ట్రంప్ కు సంబంధించి మూడుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. 2018లో అణు నిరాయుధీకరణ యత్నాలకు ఇద్దరు నార్వే ప్రజాప్రతినిధులు, 18 మంది రిపబ్లికన్ సభ్యులు ఆయన పేరును ప్రతిపాదించారు. నాడు ఉత్తర కొరియా, అమెరికా మధ్య చర్చలను దీనికి కారణంగా చూపారు. కానీ, బహుమతి రాలేదు. 2020లో మరోసారి ట్రంప్ బృందం నోబెల్ యత్నాలు చేసింది. పశ్చిమాసియాలో అబ్రహం ఒప్పందాలు చేయించినందుకు ఓ స్వీడిష్ చట్టసభ సభ్యుడు, కొందరు ఆస్ట్రేలియా లా ప్రొఫెసర్లు, ఫిన్లాండ్ చట్టసభ సభ్యుడు, ఐరోపా పార్లమెంట్ సభ్యుడు ఆయన పేరును ప్రతిపాదించారు. అప్పుడు కూడా నోబెల్ రాలేదు. ఇక 2024లో ఆయన అధ్యక్ష పదవి చేపట్టేందుకు సిద్ధమైన వేళ కూడా ఆయన పేరును కాంగ్రెస్ ఉమెన్ క్లాడియా టెన్ని నోబెల్‌కు నామినేట్ చేశారు. దాదాపు ఆరు వరకు నామినేషన్లు రాగా.. ఆ సారీ బహుమతి ట్రంప్‌ను వరించలేదు.
ఇక ఈ ఏడాది ట్రంప్ ఇప్పటి వరకు కనీసం నాలుగు నోబెల్ నామినేషన్లు సాధించారు. ఆయన పేరును ప్రతిపాదించిన వారిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ వంటి వారున్నారు. ఈ సారి దానిని ఆయన మరింత సీరియస్‌గా తీసుకొన్నారు. ఇజ్రాయెల్ -ఇరాన్, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియా, భారత్-పాక్ మధ్య ఆయనే సంధి చేశారని వైట్ హౌస్ చెబుతోంది. నిజానికి ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని అధికారం చేపట్టిన 24 గంటల్లో ఆపుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. పుతిన్ అమెరికాను లెక్కచేయకపోవడంతో.. చూస్తుండగానే 24 వారాలు కూడా గడిచిపోయాయి. ఈ క్రమంలో రష్యాను నయానో భయానో లొంగదీసుకొని యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ యత్నాలు చేస్తున్నారు.
అయితే ట్రంప్ కు నోబెల్ రాకపోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, శాంతి శాంతి అంటూనే యుద్ధోన్మాద చర్యలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. 2025లో కేవలం ఆరు నెలల్లో పలు దేశాల్లో ట్రంప్ 500 పైగా దాడులు చేయించారు. ఇవి ఒబామా, బైడెన్ హయాంలో కంటే ఎక్కువ. యెమెన్, ఇరాన్లలో 200కు పైగా బాంబింగ్‌లు నమోదయ్యాయి, ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. యెమెన్‌లో జరిగిన కొన్ని దాడులను హ్యూమన్ రైట్స్ వాచ్ యుద్ధ నేరాలు గా అభివర్ణించింది. ఈ చర్యలు ట్రంప్ శాంతి బహుమతి అర్హతపై ప్రశ్నలు లేవనెత్తాయి. Trump Nobel Peace Prize.
అధికారంలోకి రావడంతోనే ట్రంప్ యూఎస్ ఎయిడ్ ఫుడ్ సహాయ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం వల్ల సుడాన్, గాజా, కాంగో వంటి ప్రాంతాల్లో సుమారు 20 లక్షల మంది పౌష్టికాహారం కోల్పోయారు. దక్షిణ సూడాన్‌లో ఈ నిర్ణయం శతాబ్దంలోనే అతిపెద్ద ఆకలి సమస్యకు దారితీసిందని నివేదికలు చెబుతున్నాయి. పేద దేశాల్లో అన్నార్తులకు ఆహారం అందించే నిధులకు భారీగా కత్తెరేశారు. దీంతో 2030 నాటికి సుమారు 1.4 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే ముప్పు పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. వీటికి ట్రంప్ నే కారణంగా భావించాలి.
అయితే ఒబామాకు అవార్డు వచ్చినప్పుడు తనకు ఎందుకు రాదని ప్రశ్నిస్తున్నారే తప్ప.. తాను చేసిన తప్పుల గురించి తెలుసుకోవడం లేదని అంటున్నారు. ముఖ్యంగా టారిఫ్ ల పేరుతో ప్రపంచ దేశాల్లో అస్థిర, అశాంతి రేపడం కూడా ఓ తప్పే. ఇలాంటి తప్పులను చేసిన నాకు నోబెల్ బహుమతి రాదా అంటే ఏం అనాలి.. ఇది ట్రంపే గ్రహించాలి.
Also Read: https://mega9tv.com/international/how-trump-united-india-china-and-russia-against-america/