
Hudhud Cyclone Visakhapatnam: ఎంతో ప్రశాంతమైన విశాఖపై హుద్ హుద్ తుపాను విరుచుకుపడి అప్పుడే 11 ఏళ్లు అయ్యింది. 2014 అక్టోబరు 12న తీరం దాటిన హుద్ హుద్.. కుండపోత వర్షాలు కురిపించింది. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. ముందెప్పుడు చూడని విలయాన్ని సృష్టించాయి. అన్ని వ్యవస్థలూ కుప్పకూలిపోయాయి. అప్పటి వరకూ నీడనందించిన భారీ వృక్షాలు రోడ్లపై కూలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. బయటి ప్రపంచంతో విశాఖకు సంబంధాలు లేకుండా చేసింది హుద్ హుద్ తుఫాన్. హుదు హుద్ తుపాన్ విశాఖలో చేసిన విలయతాండవానికి నేటికీ 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా Mega9tv ప్రత్యేక కథనం
సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఇదే రోజున విశాఖ నగరంపై హుదు హుద్ తుఫాన్ విలయతాండవం చేసింది. హుద్ హుద్ తుఫాన్ గమనాన్ని తీవ్రతను గమనించిన తుపాను హెచ్చరికల కేంద్రం అక్టోబర్ 8 వ తేదీనే దాని పరిధి సుమారు 500 కిలోమీటర్లు ఉండవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలను ముందస్తుగానే హెచ్చరించింది. ముందుగా ఒడిశాలో తీరం దాటొచ్చని అంచనా వేశారు. అయితే ఈ తుఫాను దిశను మార్చుకుని విశాఖ వద్ద తీరం దాటింది. అక్టోబర్ 12,13 తారీఖుల్లో విశాఖలో బీభత్సం సృష్టించింది. తుఫాను తీవ్రతను ముందుగానే అంచనా వేసిన ఏపీ ప్రభుత్వం 5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఆ రోజు ఎంతమంది చనిపోయారు అనేదానిపై ఇప్పటికీ అనేక అంచనాలు ఉన్నాయి. 24 మంది చనిపోయినట్టు అధికారులు చెబితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రవేటు నివేదికలు తెలిపాయి.
విశాఖ ఎయిర్పోర్ట్ మొదలు.. బీచ్ రోడ్డు వరకూ అన్నీ ధ్వంసం అయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. విద్యుత్, టెలికాం, సమచార, రవాణా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. ఎందరో నిరాశ్రయులయ్యారు. విశాఖ ప్రజలు మనోధైర్యం కోల్పోయారు. ఇక విశాఖ నగరం కోలుకోవడం కష్టమే అనే భావన ఏర్పడింది. అంతలా బీభత్సం సృష్టించింది హుద్ హుద్ తుపాను.
తుఫాను ప్రభావంతో జరిగిన ఆస్తినష్టం అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.63 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తి నష్టం జరిగింది అని చెబుతారు. ఆంధ్ర ప్రదేశ్ సహా ఒడిశా, అండమాన్ అండ్ నికోబర్ ద్వీపాలు ఈ తుపాను ధాటికి దెబ్బ తిన్నాయి. ఇందుకు కారణం హుద్ హుద్ తుఫాను ఒకదాని వెంట మరొకటిగా వచ్చిన రెండు తుపానులు అని చెప్పాలి. ఎందుకంటే విశాఖపై దాని ప్రభావం రెండు భాగాలుగా పడింది. తుఫాను ప్రచండమైన గాలులు భారీ వర్షంతో తుపాను విరుచుకుపడింది. దీనివల్ల జనావాసాలు దెబ్బ తినడంతోపాటు,సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది.
ఇక తుపాను ప్రభావంతో ఉమ్మడి విశాఖ సహా, తూర్పుగోదావరి , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. రోడ్లు పాడైపోయాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా,కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. NDRF నుండి 240 మంది,ఆర్మీ నుండి 240 మంది సైనికులు,నేవీ నుండి 120 ,గజ ఈతగాళ్లు 270 మంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఒక్క విశాఖలోనే 139 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ లోని చాలా ఇండస్ట్రీలు హుద్ హుద్ తుఫాన్ ధాటికి స్టీల్ ప్లాంట్ లో పని నిలిచిపోవడంతో పాటు, వైజాగ్ పోర్ట్, గంగవరం పోర్ట్, షిప్ యార్డ్ లు దెబ్బతిన్నాయి. సరుకు రవాణా తాత్కాలికంగా నిలిచిపోయింది. వైజాగ్ లో 144, విజయనగరం లో 83 ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లు ధ్వంసం అయ్యాయి. కేవలం పరిశ్రమలకే 1000 కోట్లు నష్టం వాటిల్లింది అని లెక్కలు చెబుతున్నాయి.
అలాంటి పరిస్థితిని నాటి సీఎం చంద్రబాబు ధైర్యంగా ఎదుర్కొన్నారనే ప్రశంసలు ఉన్నాయి. తుపాను తీవ్రత పూర్తిగా తగ్గకముందే.. విశాఖ చేరుకున్నారు. మొదట బాధితుల్లో ధైర్యం నింపారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇతర జిల్లాల నుంచి నిత్యావసర సరకులు తెప్పించి పంపిణీ చేయించారు. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో మాట్లాడి సహాయక చర్యలను పరుగులు పెట్టించారు. సీఎం వచ్చి క్షేత్ర స్థాయిలో పాల్గొనడం తో అధికారులు,సిబ్బంది నిద్రాహారాలు లేకుండా కష్టించి మూడు రోజుల్లోనే జనజీవనానికి ఇబ్బంది లేకుండా చేశారు. అలాగే దేశ ప్రధాని మోదీ కూడా విశాఖలో పర్యటించి,కలెక్టర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్ పెట్టి పరిస్థితిని సమీక్షించారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లను ప్రకటించారు. విశాఖ నగరంలో ఎక్కడ చూసినా శిధిలాలే కనిపించాయి. కేంద్ర, రాష్ట్ర బృందాలతో వాటిని తొలగించి.. తక్కువ రోజుల్లో సాధారణ స్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా విద్యుత్, రవాణా వ్యవస్థ తొందరగా మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత టెలికాం వ్యవస్థను పురరుద్ధరించి.. బయటి ప్రపంచంతో విశాఖకు బంధాన్ని తీసుకొచ్చారు. నెమ్మదిగా విశాఖ కోలుకుంది. మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. Hudhud Cyclone Visakhapatnam.
భయంకరమైన విలయాన్ని చూసిన విశాఖ.. ఇప్పుడు విజయం దిశగా అడుగులు వేస్తోంది. 2014లో బీభత్సాన్ని చూసిన విశాఖ.. 10 ఏళ్ల లోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు వేదికైంది. ఇదే కాదు.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చింది. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది. విశాఖ కోలుకోవడం కష్టమే అన్న స్థాయి నుంచి డెస్టినేషన్ సిటీగా పేరు తెచ్చుకుంటోంది. అయితే,నాటి విలయ తాండవాన్ని గుర్తు చేస్తే మాత్రం విశాఖ వాసుల మదిలో ఆ కాళరాత్రి పుట్టించిన భయాలు మళ్లీ మెదులుతుంటాయి.