
Indian Political Parties: బీహార్ రాజకీయాలు హీటేక్కుతున్నాయి. పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండనుంది. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలని అధికార ఎన్‌డీఏ కూటమి, విపక్ష మహా ఘట్ బంధన్ పట్టుదలతో ఉన్నాయి. అటు ప్రశాంత్ కిశోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ, వీఐపీ పార్టీ కూడా తమ సత్తాను చాటుకోవాలని భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ పార్టీల ఫోకస్ అంతా నవంబరు 6న 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న తొలి విడత పోలింగ్ పైనే ఉంది. ఈ స్థానాల్లో ఎలాంటి ఫలితం రావొచ్చు..? 2020 ఫలితమే రిపీట్ అవుతుందా..? రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించేలా రిజల్ట్ ఉంటుందా..? అనేది ఈ స్టోరీ తెలుసుకుందాం.
2020లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. కానీ ఈ సారి రెండు విడతల్లోనే ఓటింగ్ జరగబోతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 121 స్థానాలకు నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. మిగతా 122 స్థానాల్లో నవంబరు 11న ఓటింగ్ నిర్వహిస్తారు. నవంబరు 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తొలి విడత పోలింగ్ జరగనున్న 121 అసెంబ్లీ స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి, ఇండియా కూటమిలోని పార్టీలు బలంగా ఉన్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే, ఈవిషయం ఇట్టే అర్థమైపోతుంది. ఆ పోల్స్‌లో 121 అసెంబ్లీ స్థానాలకుగానూ అత్యధికంగా 42 సీట్లను లాలూప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ గెల్చుకుంది. ఆర్‌జేడీ మిత్రపక్షాలు కాంగ్రెస్ 8, సీపీఐ 7, భారత కమ్యూనిస్ట్ పార్టీ 2, భారత కమ్యూనిస్ట్ పార్టీ 2, వీఐపీ పార్టీ 4 స్థానాలను గెల్చుకున్నాయి. ఎన్‌డీఏ కూటమిలోని బీజేపీ 32 స్థానాలను, సీఎం నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ 23 స్థానాలను సాధించాయి. ఈసారి తొలి విడత పోలింగ్ జరగనున్న 121 స్థానాల్లో 2020లో వచ్చిన ఫలితాల గణాంకాలను పరిశీలిస్తే మహా ఘట్బంధన్ 61 సీట్లను, ఎన్‌డీఏ కూటమి 59 సీట్లను కైవసం చేసుకున్నాయి.
కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ అప్పట్లో 1 అసెంబ్లీ స్థానాన్ని గెల్చుకుంది. బేగూసరాయ్ లోని మథిహాని సీటును ఆ పార్టీ దక్కించుకుంది. ఎన్నికల ఫలితం వచ్చాక, ఎల్‌జేపీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ పార్టీలో చేరిపోయారు. ఈవిధంగా 121 అసెంబ్లీ సీట్లలో 60 ఎన్‌డీఏకు, 61 ఇండియా కూటమికి దక్కాయి. ఈ సంఖ్యను బట్టి ఆనాడు అధికార, విపక్ష కూటముల మధ్య ఎంత టఫ్ ఫైట్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా 121 సీట్లలో ఇదే విధమైన గట్టి పోటీ ఉంటుందని పలువురు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం జన్ సురాజ్, మజ్లిస్ లాంటి పార్టీలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవని అంచనా వేస్తున్నారు.
2020 అసెంబ్లీ పోల్స్‌లో వీఐపీ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం బోచాహా అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే మాత్రమే వీఐపీ పార్టీలో కొనసాగారు. ఆయన అకాల మరణంతో 2022 ఏప్రిల్‌లో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. దీనిలో ఆర్‌జేడీ అభ్యర్ధి విజయఢంకా మోగించి, అధికార ఎన్‌డీఏ కూటమికి షాకిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమ ముగ్గురు ఎమ్మెల్యేలను లాక్కున్న బీజేపీనే వీఐపీ పార్టీ ప్రధాన ప్రత్యర్ధిగా భావించింది. అందుకే అది ఇప్పుడు ఇండియా కూటమిలో చేరిపోయింది. తద్వారా తాము అన్యాయంగా కోల్పోయిన అసెంబ్లీ స్థానాలను మళ్లీ దక్కించుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. బిహార్‌లో తొలి విడత అసెంబ్లీ పోల్స్ జరగనున్న పలు స్థానాల్లో వీఐపీ బలంగా ఉంది. ఈ పార్టీ ఓటుబ్యాంకు దన్నుతో తమ అభ్యర్థుల విజయం మరింత సునాయాసం అవుతుందనే భావనలో ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు ఉన్నాయి.
బిహార్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 121 సీట్లలో 70 సీట్లు తిర్హట్, మిథిల ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి బలంగా ఉంది. ఈసారి కూడా అక్కడ అధికార కూటమికి సానుకూల పవనాలు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలోని ఎన్‌డీఏ కూటమిలో అంతగా ఐక్యత లేదు. కానీ ఇప్పుడు జేడీయూ, ఎల్‌జేపీలను బీజేపీ కలుపుకొని ముందుకు సాగుతోంది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఎం నీతీశ్ కుమార్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌లు ఎన్‌డీఏ కూటమి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ ఐక్యతాభావన అధికార కూటమికి మెరుగైన ఫలితాలను సాధించిపెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు.
మరోవైపు విపక్ష ఇండియా కూటమిని సైతం తక్కువ అంచనా వేయలేం. గత అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష పార్టీలు చాలా బాగా రాణించాయి. పెద్దసంఖ్యలో సీట్లను గెల్చుకున్నాయి. కేవలం జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ నిర్ణయంతో రాష్ట్ర రాజకీయ కూర్పులో అనూహ్య మార్పులు వచ్చాయి. అందుకే ఈసారి జేడీయూ కంచుకోటలను బద్దలు కొట్టాలనే వ్యూహంతో విపక్ష పార్టీలు స్కెచ్‌ను రెడీ చేస్తున్నాయి. అటు ఎన్‌డీఏ కూటమి నుంచి వీలైనన్ని ఎక్కువ అసెంబ్లీ సీట్లను పొందేందుకు కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పలుమార్లు సీఎం నీతీశ్‌ను బహిరంగంగానే చిరాగ్ విమర్శించారు. ఈ అంశాలన్నీ ఈ ఎన్నికల్లో తమకు కలిసొస్తాయని ఇండియా కూటమి భావిస్తోంది. మొత్తం మీద అన్ని పార్టీల అభ్యర్థుల ప్రకటన జరిగిన తర్వాతే, తొలి విడత పోలింగ్ ఫలితంపై ఒక అంచనాకు రావొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
నవంబరు 6న తొలి విడత పోలింగ్ జరగనున్న 121 అసెంబ్లీ స్థానాలు 18 జిల్లాల్లో ఉన్నాయి. వీటిలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే, పట్నా, భోజ్‌పూర్, బక్సర్, సివాన్, సమస్తిపూర్, బేగూసరాయ్ జిల్లాల్లో ఇండియా కూటమి ఆధిపత్యాన్ని కనబర్చింది. ఈ ఆరు జిల్లాల్లోని మొత్తం 50 అసెంబ్లీ స్థానాల్లో 33 సీట్లను మహా ఘట్బంధన్ కూటమిలోని పార్టీలే గెలవడం గమనార్హం. వైశాలి, ముజఫర్‌పూర్, మాధేపురా, ఖగారియా జిల్లాల్లో ఎన్‌డీఏ కూటమికి మహా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ఇక నలంద, దర్భంగ, గోపాల్‌గంజ్, ముజఫర్‌పూర్ జిల్లాల్లో ఎన్‌డీఏ కూటమి మంచి పనితీరును కనబర్చింది. దర్భంగ, నలంద జిల్లాల్లో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉండగా, 14 సీట్లను ఎన్‌డీఏ కైవసం చేసుకుంది. కానీ ఇతర జిల్లాల్లో అంతగా రాణించలేకపోయింది. మిగతా కొన్ని జిల్లాల్లో ఇండియా కూటమి, ఎన్‌డీఏ కూటమి సరిసమానమైన స్థాయుల్లో ఫలితాలను సాధించాయి.
2024లో బిహార్ లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలను కూడా మనం తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫలితాల ట్రెండ్, తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజల అభిప్రాయానికి ఒక ప్రమాణం లాంటిది. ఆ పోల్స్‌లో బీజేపీ, జేడీయూ చెరో 12 లోక్‌సభ స్థానాలు సాధించాయి. అంతక్రితం లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే, బీజేపీకి 5 సీట్లు, జేడీయూకు 4 సీట్లు తగ్గాయి. బిహార్‌లోని కీలకమైన షాహాబాద్ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఈసారి తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతంలో జరిగిన ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఎన్‌డీఏ కూటమి గెలిచింది. కానీ 2024 లోక్ సభ ఎన్నికల్లో షాహాబాద్ లోని అన్ని సీట్లను ఎన్‌డీఏ కోల్పోయింది. ఈ పరిణామం ఇండియా కూటమి నైతిక బలాన్ని పెంచింది. ఈనేపథ్యంలో పూర్తి విశ్వాసంతో అధికార కూటమిని ఢీకొనేందుకు విపక్ష కూటమి రెడీ అయింది. ఓ వైపు ప్రధాని మోదీ, సీఎం నీతీశ్ మరోవైపు రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ ప్రచార బరిలోకి దిగనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించనున్నారు. చాలా చిన్న పార్టీలు కూడా బరిలో ఉన్నాయి. అందుకే తొలి విడత పోలింగ్ జరిగే 121 అసెంబ్లీ సీట్లలో ఎవరిది పైచేయి అవుతుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.
2020 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు వేరు. ఆ సమయానికి ఎన్‌డీఏ కూటమిలో గందరగోళం ఉంది. ఐక్యత లేదు. దీనివల్ల అప్పట్లో షాహాబాద్‌లోని అనేక జిల్లాల్లో ఆ కూటమి తుడిచిపెట్టుకు పోయింది. చాలా జిల్లాల్లో జేడీయూ ఖాతాను కూడా తెరవలేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతల్లో జరిగాయి. ఒకటో విడత, రెండో విడతలలో ఎన్‌డీఏకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. అయితే మూడో విడత పోలింగ్‌కు ముందు ఎన్‌డీఏ కూటమి సీనియర్ నాయకులు అసెంబ్లీ స్థానాల్లో పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో ఆ విడతలో ఫలితం ఎన్‌డీఏ కూటమికి అనుకూలంగా మారిపోయింది. ఈసారి ఎన్‌డీఏ కూటమిలో ఐక్యత కనిపిస్తోంది. నీతీశ్ కుమార్ ప్రభుత్వం కూడా చాలా మంచి పనులు చేసింది. వీటి నుంచి అధికార కూటమి ప్రయోజనం పొందుతుంది. అందుకే తొలి విడతలో ఎన్‌డీఏ పైచేయిని సాధించొచ్చు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఇండియా కూటమి, ఎన్‌డీఏ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Indian Political Parties.
తొలి విడత పోలింగ్ జరిగే బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ఒవైసీ, పీకే ప్రభావం కనిపించొచ్చు. యువ, మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు నీతీశ్ కుమార్ సర్కారు తీసుకున్న ప్రజాకర్షక నిర్ణయాలు ఎన్‌డీఏ కూటమికి అడ్వాంటేజీగా మారొచ్చు. నీతీశ్ కుమార్ ఆరోగ్యం గురించి చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రభుత్వంపై పెద్దగా ప్రజాగ్రహం లేదు. బిహార్‌లో కులం, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల ప్రాతిపదికన ఓటింగ్ జరుగుతుందనే అంశాన్ని మనం మర్చిపోకూడదు. 2020 నాటితో పోలిస్తే ఇప్పుడు ఎన్‌డీఏ కూటమి బలంగా ఉంది. అయితే అధికార, విపక్ష కూటములను అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే బలాబలాలపై స్పష్టమైన అంచనాకు రావడం సాధ్యమవుతుంది. ఇండియా కూటమినీ తక్కువ అంచనా వేయలేమనేది విశ్లేషకులు మాట. చూడాలి మరీ ఏం జరుగుతుందో.