వలస నేతల్లో “అంతర్మథనం”.!

Spread the love

Nizamabad Valasa Leaders: వలస నేతల్లో పోరాటం ప్రారంభమైంది. పాతనేతలకే కీలక పదవులు ఇవ్వనున్నారని వారు బాధ పడుతున్నారు. ఐదేళ్లు సీనియారిటీ దాటితేనే డీసీసీ అధ్యక్ష పదవికి అర్హత ఉంటుందని తేల్చి చెప్పారు ఎఐసిసి నేతలు. నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే ఫార్ములా కొనసాగనుందా అని జోరుగా ప్రచారం సాగుతోంది. పాత కొత్త నేతలకు పార్టీలో కొన్ని ప్రాంతాలలో మనస్పర్థాలకు దారి తీసింది. దీంతో వలస నేతలు ఆలోచనలో పడ్డారు. ఇంతకు ఆ వలస నేతలు ఎవరు..ఆ ప్రాంతం ఎక్కడ…అసలు అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ

తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు ” అన్న సుమతి పద్యం అక్షరాల నేటితరం రాజకీయ నేతలకు సరిపోతుంది. అధికారం కోసం ఎంతటికైనా దిగజారి పోవడం, షర్ట్ మార్చినంత ఈజీగా పార్టీలు మార్చేయడం ఇటీవల కాలంలో పొలిటికల్ లీడర్లకు కామన్ అయ్యింది. అలాగే పార్టీలు కూడా వలసలను ప్రోత్సహించడం, ఏదో సాకుతో గాలం వేయడం ప్రధాన పనిగా పెట్టుకున్నాయి. గత దశాబ్ద కాలంగా వలసల సంస్కృతి కొనసాగుతోంది. ఎప్పుడు ఏ నేత ఏ పార్టీలో ఉన్నాడో తెలియని పరిస్థితి. అధికారం మారగానే మరో ఆలోచన, సిద్ధాంతం, విలువలు లేకుండా పార్టీలు మార్చేసి, తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. అలాంటి నేతలనే పార్టీల ముఖ్యనేతలు అక్కున చేర్చుకుని అవకాశాలు ఇస్తున్నారు.

ఇక ఆర్థికంగా బలమైన వ్యక్తులను పార్టీలో చేరగానే బడా లీడర్లుగా అవకాశాలు ఇస్తున్నారు. పార్టీ కోసం అనేక ఏళ్లుగా పని చేసిన నేతలకు, కార్యకర్తలకు మాత్రం అవకాశం దక్కడం లేదు. ఒకప్పుడు రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలు నేతల్లో జవాబుదారితనం కనిపించేది. అవకాశవాద రాజకీయాలు ప్రజల్లో అసహనం కలిగిస్తోంది. గత పదేళ్ల గులాబీ పాలన తర్వాత రెండేళ్ల క్రితం అధికారం హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు చేరాయి. అనేకమంది ఇతర ముఖ్య నేతలతో పాటు, కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరారు. చేరిక సమయంలో ఇచ్చిన హామీల కోసం నేడు ముఖ్యనేతల చుట్టు ప్రదిక్షణలు చేయాల్సి వస్తుంది.

ఇక నామినేటెడ్ పదవులు దక్కకపోవడంతో ఇక పార్టీలో కీలక పదవులు ఆశిస్తున్నారు. అయితే పార్టీలో పాతకాపుల డిమాండ్ ను అధిస్థానం పరిగణలోకి తీసుకుంది. పాతనేతలకు ప్రాధాన్యం ఇస్తూ… వలస నేతలకు ప్రాముఖ్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడే అదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీలో అమలు చేస్తున్నారు. దీంతో పదవుల ఆశతో పార్టీలో చేరిన నేతలు నిరాశకు గురవుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా పాత నేతలకే అవకాశం ఇచ్చిన అధిష్టానం ఇటీవల పార్టీ పదవుల్లో కూడా పాత నేతలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలకు భంగపాటు తప్పడం లేదనే తెలుస్తుంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ కోటకు బీటలు వేసిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పూర్వ వైభవం కోసం వలసలపై ఫోకస్ పెట్టింది. అనేకమంది నేతలు పార్టీలోకి వచ్చారు. క్యాడర్ మాత్రం అంతగా వలసలు వెళ్లలేదు. కీలక నేత మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కారు దిగి హస్తం దోస్తానా పట్టారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నేతలు వలసబాట పట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాత్రం ప్రభుత్వంలో సలహాదారు పదవిని కట్టబెట్టారు. అయితే మిగతా నేతలకు అవకాశం దాదాపుగా దక్కలేదు. నామినేటెడ్ పదవుల్లో కూడా తాహెర్ బిన్ హుందాన్, మానాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, అన్వేష్ రెడ్డి, బాలరాజ్ లకు కీలక పదవులు ఇచ్చారు. వీరంతా పాత సీనియర్ కాంగ్రెస్ నాయకులే. అధికారంలోకి రాగానే కొత్తగా పార్టీలో చేరిన నేతలకు పదవుల్లో ఛాన్స్ దక్కలేదు. ఆర్మూర్, నిజామాబాద్, భీంగల్ మున్సిపాలిటీలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరిపోయారు. అయినా వాళ్ళకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదని వాపోతున్నారు.

నాలుగైదు రోజులుగా డీసీసీ అధ్యక్ష నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఏఐసీసీ పరిశీలకులు కామారెడ్డి, నిజమాబాద్ జిల్లాలలో తిష్టవేసి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా స్థానిక నేతలు, ముఖ్య కార్యకర్తలు, ప్రజలు, మీడియా నుంచి అభిప్రాయాలను తీసుకొని నివేదికగా సిద్ధం చేస్తున్నారు. పార్టీని పటిష్టం చేసే దిశగా డిసిసి ఎన్నికలను వేదికగా కాంగ్రెస్ పార్టీ మార్చుకుంది. అయితే డిసిసి అధ్యక్షులు నియామకంలో కాంగ్రెస్ పార్టీతో కనీసం ఐదేళ్ల అనుబంధం దాటితేనే అర్హత అనే నిబంధన పెట్టారు. కొందరు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు డిసిసి కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దరఖాస్తులు చేసుకున్నారు. అధిష్టాన నిర్ణయంతో కాంగ్రెస్ వలసదారులందరూ తీవ్ర నిరాశకు గురయ్యారు. నామినేటెడ్ లో చోటుదక్కకపోగా పార్టీలో కూడా కీలకమైన పదవులు రావనే విషయం తేలిపోయింది. కార్యవర్గంలో అవకాశం కల్పించే విషయంలో మాత్రం కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీగా ఉంది. ఇదిలా ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కొత్తవారికి అవకాశం ఇస్తూనే పాతవారికి ప్రాధాన్యత ఉంటుందనేది కాంగ్రెస్ అధిష్టానం స్పష్టంగా ఇదివరకే చెప్పింది. దీంతో కాంగ్రెస్ వలసదారుల్లో అంతర్మధనం మొదలైం Nizamabad Valasa Leaders.

ఇక దీంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలస వెళ్లిన నేతలు పునరాలోచనలో పడ్డారు. కీలక పార్టీ పదవులకు అర్హత లేకపోగా, నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూడా ప్రాధాన్యత దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. బహాటంగానే వలసనేతలు మాట్లాడుతున్నారు. అయితే ఇటీవల తమకు ప్రాధాన్యత దక్కలేదని బాన్సువాడ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరారు. అదే క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లో చేరిన నేతలు సొంతగూటికి వెళ్లాలని పునరాలోచన చేస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశామా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు భారంగానే అయింది. అనేక ఏళ్లుగా కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీనీ వదలకుండా, అవమానాలను అవరోధాలను ఎదుర్కొని నిలబడ్డ నిజమైన కాంగ్రెస్ నేతలకు అవకాశాలు ఇవ్వడమే సమంజసం. అయితే పార్టీలో చేరేటప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కూడా అంతే బాధ్యత. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందే.