
CM Revanth Reddy: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. ఇది చినికి చినికి గాలి వాన లాగా మారింది. ఆ తర్వాత కొండ సురేఖ ప్రైవేట్ ఓఎస్డీ సుమంత్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అతడిని తొలగించింది. అంతేకాదు ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఫిర్యాదు మేరకు కేసు కూడా నమోదయింది. ఇంతకు అసలు ఏం జరిగింది…సీఎం రేవంత్ తో కొండా దంపతులు..కాంప్రమైజ్ అసలు ఏం జరిగింది?
సిమెంట్ కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు అతడిని అదుపులో తీసుకోవడానికి వెళ్లిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత ప్రతిఘటించింది. దీంతో పోలీసులు వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఇదంతా కూడా మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికార పార్టీపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు ఓ సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో ఓ వ్యక్తి తుపాకీ పట్టి బెదిరించాడని.. డబ్బుల వ్యవహారంలో పంచాయతీ వచ్చిందని సాక్షాత్తు మంత్రి కుమార్తె ఆరోపించడంతో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి ఇది ఒక ఆయుధం లాగా మారింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లిన విషయం తెలిసిందే. కొండా సురేఖ వద్ద ఓఎస్‌డీగా పని చేసిన సుమంత్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లడం వివాదాస్పదమైన విషజ్ఞం తెలిసిందే. ఎలాంటి నోటీసులు లేకుండా మంత్రి ఇంటికి వస్తారని ప్రశ్నిస్తూ.. సుస్మిత పోలీసులను అడ్డుకున్నారు. ఓ సిమెంట్ కంపెనీ వ్యవహారంలో సీఎం రేవంత్ మనిషి రోహిన్‌రెడ్డి గన్‌తో వచ్చారని.. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే బీసీ మంత్రి అయిన కొండా సురేఖను సీఎం, మంత్రి పొంగులేటి, వేం నరేందర్‌రెడ్డి టార్గెట్ చేశారంటూ సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. తాము ఎవరినీ బెదిరించలేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని మంత్రి కొండా సురేఖ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం.
మరోవైపు మేడారం అభివృద్ధి పనుల విషయంలో ఓ మంత్రి అందులో వేలు పెట్టారని.. దేవదాయ శాఖ మంత్రి కి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపించాయి. దీంతో అభివృద్ధి పనులపై జరుగుతున్న సమీక్షకు సురేఖ హాజరు కాలేదు. మంత్రివర్గ సమావేశానికి కూడా ఆమె దూరంగా ఉన్నారు. దీంతో ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని ప్రచారం జరిగింది. దీనికి తోడు సురేఖ ఇంటి వద్ద పోలీసు భద్రతను తగ్గించడంతో పై ఆరోపణలకు మరిత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే సుస్మిత, సురేఖతో భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ చాలాసేపు మాట్లాడారు.
ఇక ఆ తర్వాత ఒకరోజు గ్యాప్ తోనే కొండ మురళి, కొండ సురేఖ దంపతులు జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు అక్కడే ఉన్నారు.. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో.. కొండ దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాశంగా మారింది. ఈ సందర్భంగా కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ తొలగింపు, ఆయన కోసం పోలీసులు మంత్రి ఇంటికి వెళ్లడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీలో వివాదాలు లేకుండా చూడాలని కోరినట్లు సమాచారం.
మరోవైపు కొండ మురళి కూడా ఆ మధ్య విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. పైగా తనకు ఎమ్మెల్సీ ఇస్తారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని.. ముఖ్యమంత్రి మీద తనకు ప్రగాఢమైన నమ్మకం ఉందని మురళి తెలిపారు.. ఈ పరిణామాలు మొత్తం ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. CM Revanth Reddy.
జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు ఇదంతా చేరడంతో ఒక రకంగా అధికార పార్టీ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. నష్ట నివారణ చర్యలలో భాగంగా పార్టీ నాయకత్వం రంగంలోకి దిగడంతో కొండా దంపతులు మెత్తబడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సంధికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఫలితంగా దీపావళి రోజు ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి మాట్లాడారని.. ఇక వివాదం ముగిసినట్టేనని తెలుస్తోంది.