
Montha effect on Telangana: ఆంధ్రప్రదేశ్‌ను కకావికలం చేసిన మొంథా తుఫాను ఇప్పుడు తన పూర్తి ప్రభావాన్ని తెలంగాణపై చూపిస్తోంది. రాబోయే 6-8 గంటల్లో ఈ తుఫాను ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 8-12 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, యాదాద్రి – భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో 100-150 మిల్లీమీటర్ల వరకు వరద వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌లోని అమ్రాబాద్‌లో 155 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే గంటల్లో ఈ జిల్లాలో 200 మిల్లీమీటర్ల వర్షం కూడా కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
దక్షిణ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ ఆకస్మిక వరద వచ్చే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. గత అర్ధరాత్రి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంలో మరికొన్ని గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రాను రాను వర్ష తీవ్రత పెరిగి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయన్నారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దన్నారు. Montha effect on Telangana.
బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన మొంథా ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం-కళింగపట్నం మధ్య, కాకినాడకు దక్షిణంగా నరసాపురం దగ్గర ఈ తీరం దాటే ప్రక్రియ రాత్రి 11.30 నుంచి 12.30 గంటల మధ్య పూర్తయినట్లు IMD ప్రకటించింది. తీరం దాటినప్పటికీ, ‘మొంథా’ తుఫాను ప్రస్తుతం భూభాగంపై తీవ్ర తుపానుగానే కొనసాగుతోంది. ఈ సమయంలో గంటకు 85 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ‘మొంథా’ తుఫాను తెలంగాణ మీదుగా ప్రయాణించనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను నేడు మధ్యాహ్నం నాటికి ఛత్తీస్‌గఢ్ వద్దకు చేరుకుని మరింత బలహీనపడనుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది.