క్రికెట్ నుంచి మంత్రి దాక.!

Spread the love

Mohammed Azharuddin: పాలిటిక్స్ అడుగు పెట్టడమే మన చేతులో ఉంటుంది. కొనసాగడం ప్రజల చేతుల్లో ఉంటుంది. ఈ రంగంలో కూడా ఎంతమంది తలపండిన నాయకులు ఉన్నారు. వీరిలో కొంతమంది సినీ, క్రీడ రంగాలకు చెందిన వారు. వీరి స్పూర్తితో చాలామంది క్రీడరంగం నుంచి పాలిటిక్స్ లో అడుగుపెడుతున్నారు. అలా వచ్చిన వారిలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఒకరు. ఎమ్మెల్యే గా అయ్యే అదృష్టం వరించకపోయిన.. ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. ఇక్కడి వరకు అజారుద్దీన్ ఎలా వచ్చారు. క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు..? వీటితోపాటు మరిన్ని ఆసక్తికర విషయాలను అజారుద్దీన్ రాజకీయ ప్రస్థానంలో తెలుసుకుందాం.

మహమ్మద్ అజారుద్దీన్ టీమిండియా మాజీ క్రికెటర్. మంచి క్రికెటర్ కూడా. తన అద్భుతమైన ఆటతో అలరించిన అజారుద్దీన్ 1968 ఫిబ్రవరి 8న మొహమ్మద్ అజీజుద్దీన్ మరియు యూసఫ్ సుల్తానా దంపతులకు జన్మించారు. అతను ఆల్ సెయింట్స్ హై స్కూల్‌ లో చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని నిజాం కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అజారుద్ధీన్ కు క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. తన మామ, సోదరుడి ప్రోత్సహంతో.. క్రికెట్ ఆటను మరింత ప్రాక్టిస్ చేశారు. అలా 1977 నుంచి హైదరాబాద్ క్రికెట్ లీగ్‌ తో తన ఆటను ప్రారంభించాడు. తరువాత డెక్కన్ బ్లూస్ జట్టు తరపున ఆడిన ఆయన.. అనంతరం ఇంటర్-యూనివర్శిటీ టోర్నమెంట్లలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించేవారు. 1981 -82 సీజన్‌లో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఆడుతూ 18 ఏళ్ల వయసులో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత క్రికెట్ రంగంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

1989లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత అజారుద్దీన్ భారత జట్టు కెప్టెన్‌ గా అయ్యారు. అప్పుడు కూడా తన ఆటతీరుతో ఎంతమంది భారతీయు అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. 2000 సంవత్సరంలో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆయన సస్పెన్షన్ వేశారు. 2012 అజారుద్ధీన్ పై ఉన్న సస్పెన్షను ఎత్తివేశారు. 2019లో, అజార్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అజారుద్దీన్ 1987లో నౌరీన్‌ను వివాహం చేసుకున్నాడు మరియు వారికి ఇద్దరు కుమారులు మొహమ్మద్ అసదుద్దీన్ మరియు మొహమ్మద్ అయాజుద్దీన్ ఉన్నారు. 1996లో, అతను నౌరీన్‌ కు విడాకులు ఇచ్చి నటి సంగీత బిజ్లానీని వివాహం చేసుకున్నాడు. సంగీత 2010లో విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అజారుద్ధీన్ చిన్న కుమారుడు అయాజుద్దీన్ 2011లో బైక్ ప్రమాదంలో చనిపోయాడు. పెద్ద కుమారుడు అసదుద్దీన్ క్రికెటర్ కాగా.. అతను 2019లో సానియా మీర్జా సోదరి అనమ్ మీర్జాను వివాహం చేసుకున్నాడు.

క్రికెట్ లో తనదైన ముద్ర వేసుకున్న అజారుద్దీన్ ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారు. 2009లో కాంగ్రెస్‌లో చేరి, ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు. 2014లో రాజస్థాన్ టోంక్-సావాయ్ మధోపుర్‌లో ఓడిపోయాడు. 2018లో తెలంగాణ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడయ్యాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ చేతిలో ఓడిపోయాడు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఏడాది జూన్ 8న గుండెపోటుతో మరణించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 2023లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అజారుద్దీన్ మళ్లీ టికెట్ ఆశించాడు. అనూహ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. దీంతో ఆయనకు ఇక జూబ్లిహిల్స్ టికెట్ నుంచి తప్పించినట్లైంది. ఆ స్థానంలో మరొక సమర్థవంతమైన అభ్యర్థి నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. Mohammed Azharuddin.

కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అయితే తెలంగాణలో ఈ సారి మైనారిటీలను పెద్దగా పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి. ఆ విమర్శలకు ఇప్పుడు చెక్ పెట్టింది. అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు కేబినెట్ లోకి కూడా తీసుకుంటుంది. రేవంత్ కేబినెట్ లో మైనారిటీ మంత్రి ఒక్కరు కూడా లేరు. అందుకే అజారుద్దీన్ కు ఆ అవకాశం లభించింది. మంగళవారం సాయంత్రం అజారుద్దీన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వీరి సమావేశం అనంతరమే మంత్రి పదవికి సంబంధించిన నిర్ణయం వెలువడింది. అజారుద్దీన్ చేరిక తర్వాత కూడా సీఎం రేవంత్ కేబినెట్‌ లో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉండనున్నాయి. మొత్తం మీద, అజారుద్దీన్‌ కు మంత్రి పదవి కల్పించడం ద్వారా ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించడం, ఉపఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మెరుగుపరుచుకోవడం అనే వ్యూహాలు దాగి ఉన్నాయి. మరోవైపు పార్టీలో 18 ఏళ్లుగా ఉన్న అజారుద్దీన్ కు అవకాశం కల్పించడం ద్వారా, పార్టీని నమ్ముకున్న వాళ్లకు ఎప్పటికైనా అవకాశాలు లభిస్తాయనే సంకేతాలు పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా అజారుద్ధీన్ మంత్రి పదవిని దక్కించుకుంటున్నారు.