ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ మరణాల సంఖ్య 20కు చేరింది. రెండేళ్లలోనూ ఏటా వేయికి పైగా కేసులు వచ్చినా, అధికారికంగా మరణాలు నమోదు కాలేదు.అయితే ఈసారి ఏకంగా పాజిటివ్ కేసుల్లో మరణాల సంఖ్య 22కి చేరడం కలవరం రేపుతోంది. అన్ని జిల్లాల్లోనూ కేసులు గుర్తిస్తున్నా.. గత మూడేళ్లుగా చిత్తూరు జిల్లాలోనే దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు రాగా, 2024లో 514, ఈ సంవత్సరం ఇప్పటివరకు 491 వరకు నమోదయ్యాయి. తిరుపతి జిల్లాలోనూ 2023లో 276, 2024లో 184, ఈ ఏడాది 99 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది కేసుల తీవ్రతలో కాకినాడ (198), విశాఖపట్నం (158) జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ ను వెంటనే గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకొని, పరిస్థితి చేయిదాటాక హాస్పిటల్స్ కు చేరుతుండటంతో ప్రాణాంతకంగా మారుతున్నట్లు తెలుస్తోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, జాగ్రత్తలపై అవగాహన పెంచుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.