అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో మాట్లాడి పూర్తి వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు.బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమన్వయం చేసుకున్నామని, నిందితుల వేట కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనం ముఖ్యమంత్రికి వివరించారు.దర్యాప్తు పురోగతిని తనకు ఎప్పటికప్పుడు నివేదించాలని సీఎం స్పష్టం చేశారు.మరోవైపు, ధ్వంసమైన శివలింగం స్థానంలో వేద పండితులు, అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా నూతన శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్లు మంత్రి వెల్లడించారు.దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు సంయమనం పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేసి నిందితులను పట్టుకునే బాధ్యతను పోలీసు యంత్రాంగం ముమ్మరం చేసింది.