ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన నేడు ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ, ప్రెస్ మీట్ కు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వయంగా స్వీట్లు అందించారు. మీడియా ప్రతినిధులు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ స్వీట్లు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ఉండవల్లిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వ తీరును మరోసారి స్పష్టం చేశారు. రాజధాని అంశంలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం లోక్సభలో, రాజ్యసభలో 50 పార్టీలు ఉంటే, 49 పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి మద్దతు తెలిపాయని మద్దతు తెలపని ఆ ఒక్క పార్టీ వైసీపీ అని విమర్శించారు.వైసీపీ మాత్రమే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు. అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, ఎంపీలను అభినందించారు. లోక్సభ స్పీకర్ కు, రాజ్యసభ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇటీవల ‘MA VI GUN’ అంటూ జగన్ ప్రతిపాదనపై స్పందిస్తూ ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బీ ఏంటి.. నోటికి వచ్చింది మాట్లాడటం ఏంటి…ఇలాంటి వాళ్ల గురించి ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదని దుయ్యబట్టారు.