అడవి బిడ్డలకు అండగా పవన్..

Spread the love

భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఓ తెగ చెప్పుకుంటాం కానీ.. ఇప్పటికీ దేశానికి దూరంగా విసిరేసినట్లు ఉండే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా కరెంటు అంటే ఎంటో కూడా తెలియదు. అలాంటి వారిని జనాల్లో కలిపే బాధ్యత పాలకులదే. అయితే వీరికి మాత్రం జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలే కావాలి. వాటిని బాగు చేస్తేనే కదా ఓట్లు రాలేది. ఇలాంటి ప్రభుత్వాలు, పాలకులు ఉన్న ఈ రోజుల్లో.. మట్టిలో మణిక్యంలాగా దొరికారు ఓ నేత. ఆయనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అలాంటి పాలకుడిని కూడా ప్రజలు ఓన్ చేసుకోవడానికి పదేళ్లు పట్టింది. పదేళ్ల తర్వాత గెలుపును చూసిన పవన్.. అసాధ్యమని గత పాలకులు వదిలేసిన పనులను సుసాధ్యం చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఆయన ఏం చేశారు..? ఎవరి జీవితాలను మార్చారు..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేశ్  మధ్య ఆరోగ్యకరమైన పోటీ కొనసాగుతోంది. ఈ ముగ్గురు నేతల సమన్వయంతో ప్రభుత్వం పేద ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుండగా, పవన్ కళ్యాణ్ తన ప్రత్యేక శైలిలో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ముఖ్యంగా సాధారణ ప్రజలు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడంలో ఆయన చొరవ చూపుతున్నారు.

అటవీ శాఖ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలోని రొంపల్లి పంచాయతీకి చెందిన గూడెం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఇది చిన్న గిరిజన గ్రామం అయినప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం అందలేదు. మండల కేంద్రానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాహ్య ప్రపంచానికి దూరంగా, అడవి మధ్యలో విసిరేసినట్టు ఉండే ఈ గ్రామంలోని గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు వంటి కనీస వసతులు లేవు. ఇంతకాలం వారి జీవితాల్లో విద్యుత్ వెలుగులు లేవనే విషయం బాహ్య ప్రపంచానికి కూడా పెద్దగా తెలియదు. పగటి వేళల్లో ఏదో విధంగా ఉపాధి కోసం బయటకు వెళ్లగలిగినా, రాత్రిళ్లు మాత్రం ఆ గూడెం గ్రామస్తులు అడుగు బయటపెట్టలేరు. ముఖ్యంగా, అడవి జంతువులు ఎక్కడ తమ ఊరి మీద పడతాయోనన్న భయం వారిని నిరంతరం వెంటాడేది. గతంలో ఎన్నోసార్లు అధికారులు తమ సమస్యను దృష్టికి తీసుకువచ్చినా, పరిష్కారం లభించలేదు. మౌలిక వసతుల లేమితో వారు పడుతున్న వెతలు దశాబ్దాల తరబడి కొనసాగాయి. సుమారు 17 కుటుంబాలు అక్కడ విద్యుత్ లేకుండా జీవనం సాగిస్తున్న పరిస్థితి పవన్ కళ్యాణ్ మనసును కదిలించింది.

అక్కడికక్కడే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.17 ఆవాసాలకు విద్యుత్ ఇవ్వడం కోసం 9.6 కిలోమీటర్ల మేర అడవులు, కొండ ప్రాంతాల గుండా విద్యుత్ లైన్లను వేయాల్సి ఉంటుంది. ఈ క్లిష్టమైన ప్రాజెక్టుకు సుమారు 80 లక్షల రూపాయాలకుపైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అధిక వ్యయం, భౌగోళిక అడ్డంకుల దృష్ట్యా, పవన్ కల్యాణ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి, ఏపీ జెన్కో సీఎండీలకు సమస్యను తెలియజేశారు. అవసరం అయితే తక్షణం కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్  చేసిన సూచన మేరకు, భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా  ఐదు నెలల్లోనే గూడెం గ్రామానికి విద్యుత్ చేరింది.  మొత్తం 217 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇక పీఎం జన్ మన్ పథకం కింద 10.22 లక్షల రూపాయాల వ్యయంతో సోలార్ పవర్ విద్యుత్తుతో కూడిన మినీ పవర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు.

ఇది ఆ ప్రాంతంలో నిర్మించిన తొలి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది. ప్రతి ఇంటికి వైరింగ్ చేసి ఐదు బల్బులు, ఫ్యాన్ ఉచితంగా అందజేయడం ద్వారా గూడెం గ్రామం అభివృద్ధి దిశగా అడుగుపెట్టింది. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రజల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతున్నదనే నిదర్శనంగా నిలిచింది. కార్తీక పౌర్ణమి రోజున ఆ గ్రామంలో తొలిసారి విద్యుత్ వెలుగులు మెరవడంతో గ్రామస్థులు ఆనందంతో మునిగిపోయారు. ఉప ముఖ్యమంత్రి చొరవతో తమ ఊరికి వెలుగు వచ్చినందుకు గిరిజనులు పవన్ కళ్యాణ్ ఫొటోకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది కఠిన పరిస్థితుల్లో పనిచేసి ఈ ప్రాజెక్ట్‌ ను విజయవంతం చేశారు. కొండల మధ్య స్తంభాలు తరలించడం, లైన్లు వేయడం వంటి పనులు సవాలుగా ఉన్నప్పటికీ సిబ్బంది అంకితభావంతో పూర్తి చేశారు. ఈ గ్రామాన్ని యలమంచిలి శాసన సభ్యులు సుందరపు విజయ్ కుమార్ , అరకు నియోజక వర్గం జనసేన నాయకులు, జన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు. ఆ గ్రామస్తుల ఆనందోత్సాహాల్లో భాగమయ్యారు.