అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Spread the love

అభివృద్ధి, ఆధ్యాత్మికతతో అంతర్వేది వర్థిల్లాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పవిత్ర క్షేత్రంలో తాగునీటి సమస్య ఉండకూడదని రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకంను ప్రారంభించారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీంతో 30 వేల మంది తీర ప్రాంత ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదని ఆ ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని పేర్కొన్నారు.  మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలని  భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని పవన్ స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి, ఆధ్యాత్మికతతో కలిసి నడవాలని ఆకాంక్షించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు , స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్సీ శ్రీమతి గాయత్రి పాల్గొన్నారు.  30 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు తమ తాగునీటి వెతలు చెప్పుకొంటూ వినతిపత్రం ఇచ్చారని ఈ రోజు ప్రారంభించిన అంతర్వేది సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు.   వేసవి నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయన్నారు.  తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో మీ అవసరాలకు తగిన విధంగా స్వచ్ఛ జలాలు సరఫరా చేసే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *