ముంబయిలో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI) ఎక్స్ పోలో ఎరోస్ ఇన్నోవేషన్ ప్రతినిధులతో ఏపీ మంత్రి కందుల దుర్గేష్ చర్చలు జరిపారు. భారతీయ సంస్కృతి, పురాణాలు, భాషలు, కథా సంప్రదాయాలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘లార్జ్ కల్చరల్ మోడల్స్’ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలోనే మొట్టమొదటి ‘కల్చరల్ ఏఐ టూరిజం ఎకోసిస్టమ్’ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించినట్లు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, గొప్ప సాంస్కృతిక గాథలను ఆధునిక టెక్నాలజీతో కనెక్ట్ చేస్తూ పర్యాటకులకు ఇమ్మర్సివ్ డిజిటల్ అనుభూతులు అందించే దిశగా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, వారసత్వ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు పర్యాటక రంగంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకడం, అలాగే రాష్ట్ర యువతకు క్రియేటర్ ఎకానమీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. టెక్నాలజీ, కల్చర్, టూరిజం సెక్టార్ల సమన్వయంతో ఇమ్మర్సివ్ హెరిటేజ్ టూరిజంలో ఏపీని గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.