ఏపీ జెన్కో 6101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో జీవితకాల రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు సలహాలు, మార్గదర్శకంతో పాటు ఇంజినీర్లు, అధికారులు చూపిన అంకితభావం, నైపుణ్యం, కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అధిక స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించడం కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతని తెలిపారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార రంగాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యుత్ డిమాండ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని అన్నారు. గతంలో ఏపీ జెన్కోను బలహీనపరచి ప్రైవేట్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడే పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. అడ్డగోలుగా 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపారని అయితే కూటమి ప్రభుత్వం మాత్రం విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చి, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ట్రూ డౌన్ చేసి ప్రజలకు ఉపశమనం కలిగించిందని మంత్రి పేర్కొన్నారు.