రానున్న రోజుల్లో దేశమంతా మన ఏసీలే.. ఏపీ కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా

Spread the love

ఆంధ్రప్రదేశ్‌ కు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంపై విశ్వాసంతో పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఏపీని తమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలను ఏపీకి ఆహ్వానించడంతో యువనేత విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. తాజాగా మరొక అంతర్జాతీయ సంస్థ ఏపీలో తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది.  అమెరికా దిగ్గజ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యూనిట్ భూమి పూజ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో జరిగింది. అంతర్జాతీయ సంస్థలు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ ఒక పొలిటికల్ అథ్లెట్ లా దూసుకుపోతున్నారు. పక్కా ప్రణాళికతో ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలను రాష్ట్రం వైపు చూసేలా ఆకర్షించగలుగుతున్నారు. ఒకవైపు చంద్రబాబు వంటి దిగ్గజ విజనరీ నాయకత్వంలో లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు కల్పించడంలో వేగాన్ని పెంచారనే చెప్పాలి.  ముఖ్యంగా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పంథాతో వేగంగా  ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తూ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. గూగుల్ వంటి గ్లోబల్ టెక్ జెయింట్స్ నుండి తాజాగా క్యారియర్ గ్లోబల్ వంటి మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజాల వరకు అన్నీ ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ ప్రస్థానం కూడా సాధారణమైనదేం కాదు. అటువంటి సంస్థల ఏర్పాటుతో మరిన్ని కూడా అదే దారిలో పయనించే అవకాశం ఉంది. సుస్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం, అవసరమైన మానవ వనరులు ఉన్న చోట పెట్టుబడులు క్యూ కడతాయనే దానికి ఇదే నిదర్శనం. ఇక తాజా క్యారియర్ సంస్థ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం డేటా సెంటర్ల ఏర్పాటు పెరుగుతోన్న సంగతి తెలిసిందే.  డేటా సెంటర్లకు హబ్ గా ఉండడమే కాకుండా వాటిని నడిపించే వ్యవస్థలను కూడా నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డేటాసెంటర్లకు అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్, హై ఎఫీషియన్సీ చిల్లర్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్ వంటివి కీలకమైన అంశాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్ల ఏర్పాటు జోరందుకున్న తరుణంలో వాటికి కూలింగ్ యూనిట్ల సరఫరాలో క్యారియర్ కీలకపాత్ర పోషించనుంది. ఇక తాజాగా ఈ  సంస్థ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్ కూడా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.   2027 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఏసీల్లో 60 శాతం, 2028 నాటికి 80 శాతం మన రాష్ట్రంలోనే  తయారవుతాయని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో ఇది 100 శాతం అయ్యే విధంగా పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే “కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరుంది. ఇప్పటికే 9 టాప్ ఏసీ తయారీ సంస్థలు ఏపీలో ఉన్నాయి. తాజాగా ఈ సంస్థ రాకతో ఈ వాదన మరింత బలపడనుంది. మంత్రి లోకేష్ కూడా దీనిని ఉదహరించారు.  ఈ సందర్భంగా లోకేష్ మరొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు. తాను తొలిసారి ఇంట్లో వినియోగించింది క్యారియర్ ఏసీనేనని చెప్పారు. చంద్రబాబు తన ఆఫీస్ లో ఏసీ 17 డిగ్రీలు ఉండేలా చూసుకుంటారని  అన్ని డిగ్రీల కూలింగ్  ఉండే ఆవిష్కరణ చేసింది క్యారియర్ సంస్థనేని అన్నారు. ఆధునిక ఎయిర్ కండిషనింగ్‌ ను ఆవిష్కరించడం నుంచి 50 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన గ్లోబల్ పవర్ గా ‘క్యారియర్’ ఎదిగింది. ఎప్పుడూ ఇన్నోవేషన్ లో ముందున్న ఈ సంస్థ గ్లోబల్ గా కూడా ముందు వరుసలో నిలిచింది. ఇక్కడ ఈ సంస్థ రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టడమే కాక 3వేల మందికి ఉపాధిని కల్పించనుంది. ఇలా ఇన్నోవేషన్ కు ప్రాధాన్యతనిచ్చే సంస్థల రాక రాష్ట్ర ప్రగతికి మరింత జోష్ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నట్లుగా 2028 నాటికి భారతదేశానికి కావలసిన 80% ఏసీలు ఆంధ్రప్రదేశ్‌ లో తయారయ్యే పరిస్థితి వస్తే పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారి అలాగే ఈ బాటలోనే మరిన్ని ఎలక్ట్రానిక్ సంస్థలు ఏపీని తమ గమ్యస్థానంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *