తన ప్రస్థానం ఒక ప్రభంజనం…పంతం నెగ్గించుకున్న దళపతి

Spread the love

తమిళనాడు రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ సృష్టించిన  ప్రభంజనంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ ఆయన  విజయంతో పాటు రాజకీయ ఆరంగ్రేటం పార్టీ పెట్టాలనే ఆలోచన  వెనుక ఎప్పటి నుండో ఉన్న పంతం అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తనకు జరిగిన కొన్ని పరిస్థితులే రాజకీయం వైపు నడిపించాయా అనేది ఇప్పుడు అప్రస్తుతమైనప్పటికీ ప్రస్తుతం వీటిపై జరుగుతున్న చర్చ ఆసక్తికరంగా ఉంది. 2026 మే 4న వెలువడిన ఫలితాలు ద్రవిడ కోటలను బద్దలు కొడుతూ రాజకీయ యవనికపై సరి కొత్త చరిత్రనే సృష్టించాయి. తమిళనాట 50 ఏళ్ల ద్రవిడ రాజకీయాల పునాదులు కదిలిపోయాయి. నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) కేవలం రెండేళ్లలోనే రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి, దశాబ్దాల రెండు రాజకీయ పార్టీల మధ్య చిక్కుకుపోయిన అధికార పీఠాన్ని మూడో ప్రత్యామ్నాయంతో భర్తీ చేసింది. ఈ అద్భుత విజయం వెనుక విజయ్ అనుసరించిన మాస్టర్ ప్లాన్ చిన్నదేమీ కాదు. నిజానికి విజయ్ రాజకీయ అడుగులు దశాబ్దంకు పూర్వమే పడ్డాయనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అప్పట్లో తలైవా’ సినిమా విడుదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలితతో తలెత్తిన విభేదాలే విజయ్‌ లో పట్టుదలను పెంచాయనే వ్యాఖ్యలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. 2013లో విజయ్ నటించిన ‘తలైవా’ (Thalaivaa) సినిమా విడుదలకు జయలలిత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆ సినిమా ట్యాగ్‌లైన్ “Time to Lead” అని ఉండటం కారణమనే వాదన ఉంది. సినిమా విడుదల ఆలస్యం కావడంతో విజయ్ అప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అప్పట్లో ఆయన జయలలితను కలవడానికి ప్రయత్నించినా ఆమె అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని అయితే నేడు ఆయన స్వయంగా రాష్ట్రాన్ని నడిపించే స్థాయికి చేరడం ఒక సినిమాటిక్ రివెంజ్ స్టోరీని తలపిస్తోంది. ఇక రాజకీయంగా అప్పటి వరకు బలమైన పార్టీలను ఢీ కొట్టాలంటే ఎంతో గ్రౌండ్ వర్క్ కీలకం. అలాంటి గ్రౌండ్ వర్క్ ను విజయ్ చాలా చాకచక్యంగా చేశాడు. పార్టీ పెట్టింది రెండు సంవత్సరాల క్రితమే అయినప్పటికీ తన అభిమాన సంఘాలను ఒక శక్తివంతమైన కేడర్‌గా మార్చుకోవడం ఆయన ముందుచూపుకు నిదర్శనం.సినిమా వెండితెరపై కోట్లాది అభిమానులకు ఆరాధ్యుడిగా, ‘దళపతి’గా తిరుగులేని ప్రజాభిమానాన్ని చూరగొన్న విజయ్, తన సూపర్  స్టార్‌డమ్‌ ను పక్కన పెట్టేసి గెలుస్తామో..లేదో తెలియని ప్రజాక్షేత్రంలోకి దూకడం ఒక సాహసోపేతమైన నిర్ణయం. నాడు జయలలిత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న అవమానాలు, తన సినిమా విడుదలను అడ్డుకున్న తీరు ఆయనలో ఒక పంతాన్ని  రగిలించాయి. ఆ కసి, ఆ పంతమే నేడు ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ శక్తిగా మారి వెండితెరపై విలన్లను ఎదిరించే హీరోగానే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే నాయకుడిగా విజయ్ తన  ఇమేజ్‌ను ప్రజల్లోకి గట్టిగానే తీసుకెళ్లారు. దశాబ్దాల సినీ గ్లామర్‌ను పక్కన పెట్టి, సామాన్యుడి వాయిస్ గా మార్చడంలో విజయ్ చూపిన పట్టుదల అసాధారణం.  తనను అణచివేయాలని చూసిన శక్తులకు సమాధానంగా, తన అభిమాన జనాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంగా తీర్చిదిద్దారు.  ప్రజల కష్టాలపై అవగాహన పెంచుకుంటూ సమాజంలో అన్ని వర్గాలు కోరుకుంటున్న మార్పు అనే బలమైన ఆకాంక్షను తన వైపు తిప్పుకోవడంలో ఆయన విజయుడయ్యారు. నిజంగానే లీడ్ చేసే స్థాయికి చేరి తానేంటో చూపించారు. విజయ్ సినిమాల్లోని పాత్రల సారూప్యత కూడా రాజకీయ ప్రయాణంలో కనిపించింది. అదే విజయ్ ను ప్రజలకు మరింత చేరువ చేసింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానం ఒక ప్రభంజనమని స్పష్టం చేస్తోంది.  గతం నేర్పిన పాఠాలను, అప్పటి కసిని ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో ఆయన వ్యూహాత్మకతను చాటుకున్నారు. కేవలం ఎమోషన్స్ తో మాత్రమే కాకుండా, పక్కా ప్రణాళికతో అత్యున్నత రాజకీయ పీఠాన్ని అధిరోహించడమే లక్ష్యంగా సాగిన ఆయన ప్రయాణం, ఒక సామాన్య నటుడు ప్రజా నాయకుడిగా ఎలా ఎదగవచ్చో చెప్పే చారిత్రాత్మక ఘట్టంగా భావితరాలకు ఒక చెక్కు చెదరని పాఠంగా నిలవనుంది. నాడు అవమానించిన వారే నేడు ఆయన ఎదుగుదలను చూసి విస్తుపోయేలా తన విజిల్ తో విజయ్ తన ‘రాజకీయ విజయాన్ని’ మోత మోగిస్తూ  దూసుకుపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *