రైసినా డైలాగ్ 2026 సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో మొదటిసారిగా ఒక స్టేట్ సీఎంకు ఆహ్వానం పలకడం గమనార్హం.  110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిపుణులు, వ్యూహకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్ శరవేగంగా అభివృద్ధి వైపు, సాంకేతికత వైపు దూసుకు వెళ్తోందన్నారు. మూడు దశాబ్దాల క్రితం అందిపుచ్చుకున్న ఐటీ విప్లవం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి నిపుణులను అందించిందని తెలిపారు.  నాలెడ్జి ఎకానమీలో అగ్రగామిగా భారత్ ఉందని అన్నారు. 60 శాతం జీసీసీలు భారత్ లో ఏర్పాటు అయ్యాయని స్పష్టం చేశారు. డిజిటల్ కరెన్సీ సంస్కరణల ద్వారా యూపీఐ పేమెంట్ వ్యవస్థ కూడా కీలకంగా మారిందన్నారు. గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇక క్వాంటం కంప్యూటింగ్ లో ముందుకు సాగేందుకు అమరావతిని క్వాంటం వ్యాలీగా మారుస్తున్నామని వివరించారు.  త్వరలోనే క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను కూడా తయారు చేసి ప్రపంచానికి అందిస్తామని పేర్కొన్నారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది గేమ్ చేంజర్ గా మారబోతోందన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్లను ఎలా వినియోగించుకుంటామన్న అంశం ఆధారంగానే వాటి భవిష్యత్తు మారుతుందన్నారు. సైబరాబాద్ తో పాటు అమరావతిని బ్లూ గ్రీన్ సిటీగా నిర్మించే అవకాశాన్ని భగవంతుడు కల్పించాడన్నారు. టెక్నాలజీని, ఇన్ ఫ్రాను కలిపి పొల్యూషన్ ఫ్రీ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రముఖ ఐటీ కంపెనీలను భారతీయులే లీడ్ చేస్తున్నారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సహనం అనే పునాదులపై భారతీయ సంప్రదాయ మూలాలు ఉన్నాయి. సహకార ఫెడరలిజం అనే అంశంపై కేంద్ర, రాష్ట్రాలు పనిచేస్తున్నాయన్నారు.  వివిధ రకాల రీఫార్మ్స్  ద్వారా వచ్చిన వివిధ పాలసీలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేస్తాయన్నారు. ఇక అదే సమయంలో ప్రజల జీవన ప్రమాణాలను కూడా అత్యున్నతంగా తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సదస్సుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ సహా ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *