నిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టగా లోక్ సభలో ఆమోదం పొందిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చను ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమరావతికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందన్నారు. కాగా, రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా రూపొందనుంది. సభలో 11 పార్టీలకు చెందిన 17 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. 10 పార్టీలకు చెందిన ఎంపీలు మద్దతు తెలిపారు.