నేడు భారత రాజ్యాంగ నిర్మాత సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా ప్రముఖులు ఘన నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు:
భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:
భారత రాజ్యాంగ రూపశిల్పి, ముసాయిదా కమిటీ ఛైర్మన్, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుందాం. సామాజిక న్యాయం, సమానత్వం మరియు అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చేసిన అలుపెరుగని పోరాటం మనందరికీ నిరంతరం మార్గదర్శకంగా ఉంటుంది.
మంత్రి నారా లోకేష్:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం.