నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు, అభివృద్ధి మరియు పరిపాలనలో నిర్ణయాత్మక మార్పు పట్ల ప్రజలకున్న మొగ్గును స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసోం మరియు పుదుచ్చేరి అభివృద్ధి ఆధారిత నాయకత్వానికి మళ్ళీ మద్దతు తెలపగా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మరియు కేరళ ప్రజలు రాజకీయ మార్పు కోసం స్పష్టమైన ఆకాంక్షను వ్యక్తం చేశారని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యూహాత్మక దిశానిర్దేశంతో మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ చతురతతో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. ఈ కీలక మైలురాయిని అధిగమించినందుకు సువెందు అధికారికి మరియు బీజేపీ నాయకత్వానికి అభినందనలు తెలిపారు. భారతదేశ స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తినిచ్చి, అక్రమ చొరబాటు మరియు శాంతిభద్రతల సమస్యల వంటి సవాళ్లను ఎదుర్కొన్న పశ్చిమ బెంగాల్ గడ్డపై ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కానుండటం, స్థిరత్వం మరియు పురోగతి పట్ల ఆశలు కలిగిస్తోందని పేర్కొన్నారు. అసోంలో వరుసగా మూడవసారి విజయం సాధించినందుకు మరియు సీఎంగా రెండవసారి ప్రజల విశ్వాసాన్ని పొందినందుకు అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మకు అభినందనలు తెలిపారు. అలాగే కేరళలోని యూడీఎఫ్ నాయకత్వానికి మరియు పుదుచ్చేరిలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు వారి విజయాలపై అభినందనలు తెలిపారు. ఇక తమిళనాడులో టీవీకే పార్టీ ఘనవిజయం సాధించినందుకు విజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తన మొదటి ఎన్నికల బరిలోనే ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగడం, మార్పు కోసం ప్రజలకున్న స్పష్టమైన ఆకాంక్షను ప్రతిబింబిస్తోందన్నారు. తమిళనాడు ప్రజల అంచనాలను నెరవేర్చడానికి ఆయన నిబద్ధత మరియు బాధ్యతతో పని చేయాలని ఆకాంక్షించారు.