ప్రధాని మోడీని కలిసిన  ఏపీ మంత్రి లోకేష్, ఎన్డీయే ఎంపీలు 

Spread the love

ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రధాని మోడీని కలిశారు.  పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోట్ల మంది ప్రజల హృదయపూర్వక కృతజ్ఞతలను వారికి తెలియజేసినట్లు లోకేష్ తెలిపారు. అమరావతి కలను సజీవంగా ఉంచడానికి తమ భూములను సమీకరించి, ఎన్నో ఏళ్ల అనిశ్చితిని తట్టుకుని నిలబడిన మన రైతుల అసాధారణ త్యాగాలను కూడా ప్రధానికి తెలిపినట్లు పేర్కొన్నారు.  వారి త్యాగానికి గుర్తింపుగా, అమరావతిని నిజమైన ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించడంలో ఆయన నిరంతర మార్గదర్శకత్వాన్ని కోరినట్లు తెలిపారు. లోకేష్ తో పాటు ఏపీ ఎంపీలు కూడా ప్రధాని మోడీకి కృతఙ్ఞతలు తెలిపారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత బిల్లుకు నిన్న లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.  ఏపీ పునర్విభజన చట్టసవరణ పేరుతో కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సుమారు రెండు గంటలు చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ఆ తర్వాత బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక ఇటీవల అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఎవరూ కదిలించలేని దిశగా  ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్దత ప్రభుత్వ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా రాజధాని విషయంలో గతంలో జరిగినవి పునరావృతం కాకుండా  అమరావతికి పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం తీర్మానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *