అంతర్జాతీయ క్రికెట్ కు సౌతాఫ్రికా క్రికెటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ వీడ్కోలు పలికాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఒక ప్రకటనలో తెలిపాడు. ప్రోటీస్ (దక్షిణాఫ్రికా) జెర్సీని ధరించడం అనేది పట్టుదల మరియు అంకితభావంతో కూడిన ఒక గొప్ప ఘనత. ఇనా దేశం తరపున ఆడటం నా జీవితంలో దక్కిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రయాణం ఎన్నో ఏళ్ల త్యాగాలతో సాగింది, కానీ దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆ ప్రతి క్షణానికి తగిన విలువను ఇచ్చిందని తెలిపాడు. క్రికెట్ సౌత్ ఆఫ్రికాకు, ఎనోచ్ ఎన్క్వేకు మరియు ప్రోటీస్ గౌరవనీయ కోచ్‌లు, మేనేజర్లందరికీ ప్రోటీస్ జెర్సీని ధరించే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. దక్షిణాఫ్రికా ప్రజలకు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తన సహచర క్రీడాకారులకు, కోచ్‌లకు, మార్గదర్శకులకు మరియు స్నేహితులకు; నన్ను ఈ ప్రయాణంలో భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్ నాకు సర్వస్వాన్ని ఇచ్చింది, నిజానికి నేను నా జీవితాన్నే దానికి రుణపడి ఉన్నానని డస్సెన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా యువ ఆటగాళ్లకు తాను ఇచ్చే సలహా ఎప్పుడూ ఒక్కటేనని అది ఎప్పటికీ మారదని పెద్ద కలలు కనండి మరియు వాటిని సాధించడానికి మీ దగ్గర ఉన్న శక్తినంతటిని ధారబోయండని సూచించాడు. పక్కన ఉన్న వ్యక్తి కంటే నేనేదో ప్రత్యేకం అని లేదా నాకు పుట్టుకతోనే గొప్ప ప్రతిభ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను నా కలలను నిజం చేసుకోగలిగాను అనే వాస్తవమే, మీ కల ఏదైనా సరే మీరు కూడా దాన్ని సాధించగలరు అనడానికి నిదర్శనమని పేర్కొన్నాడు. ప్రోటీస్ జెర్సీలో తన సమయం ముగిసినప్పటికీ, తన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని తెలిపాడు.తనకు ఎంతో ఇష్టమైన లయన్స్ జట్టు తరపున ఆడటం కొనసాగిస్తానని డస్సెన్ పేర్కొన్నాడు. ఇక అలాగే, దక్షిణాఫ్రికా తదుపరి తరం క్రికెటర్లకు శిక్షణనిస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తూ ఈ అందమైన క్రీడకు తన వంతు సేవను అందిస్తానని చెప్పాడు.