తెలుగు తేజం భూక్యా యశ్వంత్ విజయాలు అభినందనీయం:మంత్రి లోకేష్ 

Spread the love

తెలుగు తేజం, పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ సాధిస్తున్న విజయాలు అభినందనీయమని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ‘హర్ శిఖర్ పర్ తిరంగ’ పేరుతో చేపట్టిన నేషనల్ మిషన్‌ లో భాగంగా ఇప్పటికే భూక్యా యశ్వంత్ వివిధ రాష్ట్రాల్లో ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు. ప్రతి రాష్ట్రంలో ఎత్తైన శిఖరాలను అధిరోహించి జాతీయ జెండాను ఎగరేయడం అనే కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేరుకునేందుకు భూక్యా యశ్వంత్ శ్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల ఎత్తైన పర్వతాలను అధిరోహించి.. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని 6488 మీటర్ల ఎత్తైన గోరిచెన్ పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని లోకేష్ పేర్కొన్నారు. యశ్వంత్ పట్టుదల యువతకు గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు.  ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని… జాతీయ జెండాను ఎత్తైన శిఖరాలపై ఎగరేయడంతోపాటు తెలుగు జాతి కీర్తిని మరింత ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *