ఐపీఎల్ సీజన్ 19లో పంజాబ్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం సాధించి మరో గెలుపును తన ఖాతాలో వేసుకుని అప్రతిహతంగా దూసుకుపోతూ పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది. న్యూ చండీఘడ్ ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ప్రియాన్షూ ఆర్య 93 (37; 4×4, 9×6), కూపర్ కన్నోలీ 87 (46; 8×4, 7×6) విధ్వంసకర ఇన్నింగ్స్ ల తో భారీ స్కోర్ చేసింది. మార్కస్ స్టోయినీస్ (29) పర్వాలేదనిపించాడు. లక్నో బౌలర్లలో మణిమారన్ సిద్దాంత్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు, మోసిన్ ఖాన్, మహ్మద్ షమీ ఒక్కో వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రిషబ్ పంత్ 43 (23; 1×4, 4×6), మార్క్రమ్ 42 (22; 3×4, 3×6), మిచెల్ మార్ష్ 40 (28; 3×4, 2×6), ఆయుష్ బడోని 35 (21; 5×4, 1×6), ముకుల్ చౌదరి (21 నాటౌట్) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 2 వికెట్లు, విజయ్ కుమార్ వైషాక్, యుజువేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.