కూటమి ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఉగాది కానుకగా, రాష్ట్రంలోని 11.16 లక్షల దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని నేడు మంగళగిరిలో కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది చేకూరనుంది. దివ్యాంగులకు సహయకులుగా వచ్చే వారికి 50 శాతం టిక్కెట్ రాయితీ ఇవ్వనున్నారు. ఏడాదికి రూ.207 కోటను ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మంగళగిరి నుండి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లు దివ్యాంగులతో కలిసి పెనుమాక వరకు బస్సులో ప్రయాణించారు. అంతకు ముందు బస్టాండ్ లో దివ్యాంగులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.