అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడి సమీపంలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ భవనాల వద్ద నిర్మాణ ప్రాంతంలో మెగా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపులు అకస్మాత్తుగా నిప్పులపాలయ్యాయి. కాగా, రాజధాని అమరావతిలో నిప్పుపై నిగ్గు తేల్చాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాద ఘటనలు నిజంగా ప్రమాదాలా, లేక దాని వెనుక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలని సీఎం ఆదేశించారు. వరుసగా జరుగుతున్న ఘటనలు, అవి జరుగుతున్న తీరు చూస్తుంటే కుట్ర కోణం ఉందనే అనుమానం వాయ్కతమవుతుందని ఆ దిశగా మరింత లోతుగా అన్నికోణాల్లోనూ విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కుట్ర కోణం ఉందా అనే విషయం కూడా విశ్లేషించి నిజాలు బయటకు తీయాలన్నారు. రాయపూడిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద నిర్మాణ సంస్థకు చెందిన పైపులు గత రాత్రి దగ్ధం అయిన ఘటనపై సచివాలయంలోని తన చాంబర్‌లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఇంటలిజెన్స్ చీఫ్ మహేష్ కుమార్ లడ్హాలతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రమద ఘటన గురించి అధికారులు సీఎంకు వివరించారు. ప్రమాదం జరిగిన సమయం అగ్నిప్రమాదంపై ఫైరింజన్ కు కాల్ వచ్చిన సమయం తదితర విషయాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలంలో అంత త్వరగా మంటలు వ్యాపించడానికి కారణాలు ఏంటని అడిగారు. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ద్వారా ఘటనకు కారణాలను కనిపెట్టాలని సూచించారు.