మానవ వన్యప్రాణి సంఘర్షణను నివారించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమం హనుమాన్ అని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా మన చిత్తూరు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడైతే ఏనుగులు, ఇతర వన్యప్రాణులు ఊర్లల్లోకి ఒచ్చేసి ప్రజల ప్రాణాలకు, వ్యవసాయానికి ఇబ్బందులు కలిగించే పరిస్థితుల్లో ఎలా వీటిని అదుపు చేయాలనే ఆలోచనతో పుట్టిందే ఈ హనుమాన్ ప్రాజెక్ట్ అని తెలిపారు.వన్యప్రాణులను సంరక్షిస్తూనే ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులు, ఆస్తుల సంరక్షణ హనుమాన్ ప్రాజెక్ట్ తాలూకు ప్రధాన ఉద్దేశమని వివరించారు. సంఘర్షణ జరిగినప్పుడు వెంటనే స్పందించి తగిన ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థలను హనుమాన్ ఫౌండేషన్ నిర్వహిస్తుందన్నారు. పంచాయితీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతో పాటు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్ట్ హనుమాన్ ని ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. హనుమాన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్రంలో మొట్టమొదటిసారి జీపీఎస్ ట్రాకింగ్ వంటి పూర్తిటెక్నాలజీతో కూడిన 100 వెహికల్స్ ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. దానిలో 93 రాపిడ్ రెస్పాన్స్ & రెస్క్యూ టీమ్ వెహికల్స్, 7 వైల్డ్ లైఫ్ అంబులెన్సులు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలో 4 వైల్డ్ లైఫ్ రెస్క్యూ & ట్రీట్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వన్యజీవి రక్షక్ అని అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టబోతున్నాం, వీరికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నాం.
గ్రామస్థాయిలో పాములు, ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచామన్నారు. అంతకు ముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాకా 10 లక్షలకు పెంచామన్నారు. గాయపడినవారికి పరిహారం 2 లక్షలగా పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నాం.చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చి ఇప్పటివరకు 8 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుండి ప్రజలకు, పంటలకు రక్షణ కల్పించామని వివరించారు. అటవీశాఖ అధికారులకు ఫ్రంట్ లైన్ సిబ్బంది అంకితభావం, కష్టపడి చేసిన సేవలను అభినందించారు. ముఖ్యంగా NGO’s లేకుండా ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టమని నిబద్ధతతో పని చేసిన స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేకించి అభినందనలు తెలిపారు.