ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్ పై గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో లోకేష్ మాట్లాడారు. సమగ్ర శిక్షా అభియాన్లో ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపు అంశంపై ప్రశ్నకు లోకేశ్ సమాధానం ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో సర్వశిక్ష అభియాన్లో ఆంధ్రప్రదేశ్లోనేఎక్కువ జీతాలు ఇస్తున్నట్లు వివరించారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టి కి తీసుకెళ్తామన్నారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న టీచర్లు, డీటీపీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి జీతాల పెంపుదలపై వచ్చే ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు సమావేశంలో చర్చిస్తామని, కేంద్రంతోను కూడా సంప్రదిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. అసెంబ్లీలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడకుదిటి ఈశ్వరరావు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ, సమగ్రశిక్షలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డీటీపీ ఆపరేటర్ల జీతాలు దక్షిణాది రాష్ట్రాలలో ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయని అన్నారు. గతంలో 3 నెలలకోసారి జీతాలు ఇవ్వగా, ప్రస్తుతం ప్రతినెలా ఒకటో తేదీన వారికి జీతాలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. సమగ్ర శిక్ష అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని, ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. అందువల్ల ఏ నిర్ణయం తీసుకున్నా కేంద్రప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.