
Hindupuram as district headquarters: హిందూపురం పేరు ఎత్తగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది నందమూరి ఫ్యామిలీ. దశాబ్దాలుగా హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎన్టీఆర్ కుటుంబానికి పట్టం కడుతూనే ఉన్నారు. నందమూరి బాలకృష్ణను ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా హిందూపురం అక్కున చేర్చుకుంది. దివంగత నేత ఎన్టీ రామారావు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారట. అయితే తాజాగా ఇప్పుడు ఆ టాపిక్ మరోసారి చర్చకు వస్తోంది.
గత ప్రభుత్వంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి అనంతపుం జిల్లాను అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా ప్రకటించారు .సత్యసాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ప్రకటించడంతో హిందూపురం వాసులు కొంత కినుక వహించారట. అయితే పుట్టపర్తిలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేందుకు భవనాలన్నీ అందుబాటులో ఉండడంతో గత ప్రభుత్వం పుట్టపర్తికే జై కొట్టింది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం కూడా కావడం కల్సొచ్చింది.
హిందూపురంలో ఎన్టీఆర్ కాలు మోపడంతో ఆ ప్రాంత తలరాత మారిపోయింది. ఎన్టీఆర్ హిందూపూర్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేశారు. అలాగే పారిశ్రామికవాడగా జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుంది. సేవా మందిర్, లేపాక్షిలో బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, కేంద్ర నిధులతో నడిచే ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ విద్యాలయాలతో పాటు అనేక గురుకుల పాఠశాలలను నియోజకవర్గానికి తీసుకువచ్చి హిందూపురం అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వారసుడు బాలకృష్ణ మూడోసారి హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు. ప్రధానంగా హిందూపురం నియోజకవర్గ ప్రజలు తాగునీటి సమస్యను తీవ్రంగా ఎదుర్కొనేవారు. ఆ సమస్యను తీర్చడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారట.
హిందూపురం నియోజకవర్గం బెంగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు హైదరాబాదు అటు బెంగళూరు నేషనల్ హైవే మధ్య హిందూపురం ఉండడం కూడా రవాణకు కలిసొచ్చే అంశం. ప్రధానంగా హిందూపురం పట్ట పరిశ్రమతో పాటు విద్య, ఇతర పారిశ్రామిక వాడగా అభివృద్ధికి కేంద్రీకృతమై ఉంది. అన్ని విషయాల్లో ముందున్న హిందూపురం జిల్లా కేంద్రానికి అనువైన ప్రాంతం అనడంలో ఏమాత్రం సందేహం లేదనేది స్థానికుల వాదన. Hindupuram as district headquarters.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లాల పునర్విభజన నియోజకవర్గం సరిహద్దుల మార్పుపై ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి హిందూపురం జిల్లా కేంద్రం అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో కొద్ది రోజుల్లోనే హిందూపురం జిల్లా కేంద్రం అవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు దగ్గర హిందూపురం ఎంఎల్ఏ బాలయ్య జిల్లా కేంద్రం అంశంపై పట్టుపడుతున్నట్లు అధికారవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.