వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే… పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన తాగు, సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే….వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగువేసిన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 1996 మార్చి 5 సరిగ్గా నేటికి 30 సంవత్సరాలైన సందర్భం ఇప్పటికీ గుర్తుందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు.  

వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే… పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది నేనే అని చంద్రబాబు ప్రకటించారు.  ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.38 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో…. శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం ఫోర్‌షోర్ నుండి 43.50 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనే ఆలోచనతో…. 30 ఏళ్ల క్రితం ఇదే రోజున (1996 మార్చి 5న) ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానన్నారు. 

అనేక కారణాలతో తరువాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశామన్నారు. ఈ  ప్రాజెక్టు కోసం నాడు రూ.1,414 కోట్లు ఖర్చు పెట్టాం. తరువాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని  ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం అంటూ ప్రజలను మోసం చేసి నవ్వులపాలు అయ్యిందని విమర్శించారు.  ఇక 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రూ.140 కోట్లతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం, రూ.585 కోట్లు ప్రాజెక్టు నిర్మాణం పై  ఖర్చు చేశామన్నారు. అలాగే హెడ్ రెగ్యులేటర్‌కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్‌ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది జులై నాటికి తొలి ఫేజ్ పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకొస్తామని స్పష్టం చేశారు.  2027-28 నాటికి ఫేజ్-2 నిర్మాణం కూడా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి కరువు ప్రాంతంలో ప్రతీ ఎకరానికి నీళ్లివ్వడం ద్వారా .రైతన్నల జీవితాలు మారుస్తామని స్పష్టం చేశారు.  హార్టికల్చర్ సాగుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *